హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి వ్యవహారం మరోసారి పార్టీలో చిచ్చు పెట్టింది. తెలంగాణ కాంగ్రెసు సీనియర్ నేతలు కొంత మంది రేవంత్ రెడ్డిపై భగ్గుమంటున్నారు. టీఎస్ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మంగళవారంనాడు టీపీసీసీ ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఇప్పుడు కాంగ్రెసులో అగ్గి రాజేసింది. ఎవరినీ సంప్రదించకుండా రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారని కాంగ్రెసు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చిన తర్వాత దాన్ని పాటించడం కాకుండా సొంతంగా కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఏముందని కూడా ప్రశ్నిస్తున్నారు. 

Also Read: Pragathi Bhavan Siege: ఎంపీ రేవంత్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటనలు చేశారే తప్ప అందులో పాల్గొనాలని ఎవరికీ సమాచారం ఇవ్వలేదని అంటున్నారు. సీఎల్పీ కార్యాలయంలో కొద్ది మంది సీనియర్ నేతలు కలిసినప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారశైలి చర్చకు వచ్చింది. 

సిఎల్పీ కార్యాలయంలో ఉన్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను కలిసేందుకు ఎఐసిసి కార్యదర్శులు మధుయాష్కీ గౌడ్, వంశీచందర్ రెడ్డి, సంపత్ కుమార్, కిసాన్ కాంగ్రెసు ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి వచ్చారు. కాసాపేటికి సీనియర్ నేత వి. హనుమంతరావు (విహెచ్) కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత సంపత్ కుమార్ వెళ్లిపోయారు.

వివిధ విషయాలను చర్చిస్తున్న క్రమంలో ఆర్టీసీ సమ్మె విషయం కూడా చర్చకు వచ్చింది. ఆర్టీసీ కార్మిక జేఏసీ ఈ నెల 30వ తేదీ వరకు కార్యాచరణను ప్రకటించిందని, దానికి సంఘీభావంగా వ్యవహరించడానికి బదులు పార్టీ సొంతంగా ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ఓ నాయకుడు అన్నట్లు తెలుస్తోంది. 

Also Read: ప్రగతి భవన్ ముట్టడి: పోలీసుల పద్మవ్యూహాన్ని ఛేదించిన రేవంత్, జగ్గారెడ్డి

ముట్టడి విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారని ఆయన అన్నట్లు సమాచారం. పార్టీ కార్యక్రమం చేపట్టినప్పుడు సమాచారాన్ని అందరికీ చేరవేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రగతి భవన్ ముట్టడిపై ఉత్తమ్ ఒక రోజు ముందు ప్రకటన చేశారు. పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ రెడ్డి అంతకు ముందు చెప్పారు. 

పార్టీ నిర్ణయమంటూ ఏకపక్షంగా వ్యవహరించడమేమిటనే ప్రశ్న కాంగ్రెసు నేతల నుంచి వచ్చింది. ప్రగతి భవన్ ముట్టడి వంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు పార్టీ నాయకులందరికీ భాగస్వామ్యం ఉండాలని ఓ నేత అభిప్రాయపడ్డారు. అయితే, తాము హుజూర్ నగర్ ఉప ఎన్నికపైనే చర్చించామని భట్టితో సమావేశమైన నేతలు చెప్పారు.