బంజారాహిల్స్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడికి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు ఆయన పాలిట శాపంగా మారుతుంది. సీనియర్లను సంప్రదించకుండా రేవంత్ రెడ్డి,  ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. 

తాజాగా మరోవివాదంలో ఇరుక్కుపోయారు రేవంత్ రెడ్డి. పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతోపాటు విధి నిర్వహణలో ఉన్న అధికారిని తేసేసి దురుసుగా ప్రవర్తించిన ఘటనలో రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. 

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సోమవారం ప్రగతిభవన్ ముట్టడికి పిలుపు ఇచ్చారు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 48లోని రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు తెల్లవారు జాము నుంచే బంజారాహిల్స్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ సీఐ బాలకృష్ణారెడ్డి, సెక్టార్ ఎస్ ఐ నవీన్ రెడ్డిలు ఆయన ఇంటి చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేసి బయటకు రాకుండా కట్టడి చేశారు. 

అయితే మధ్యాహ్నం 12 గంటల సమయంలో రేవంత్‌రెడ్డి పోలీసు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అనుచరులతో కలిసి అతివేగంగా ఇంట్లో నుంచి బయటకు దూసుకొ చ్చారు. ఆ సమయంలో అడ్డుకున్న ఎస్‌ఐ నవీన్ రెడ్డితో పాటు పలువురు పోలీసులను నెట్టుకుంటూ, పక్కకు తోసేస్తూ అప్పటికే సిద్ధంగా ఉన్న బైక్‌పై దూసుకుపోయారు. 

పోలీసులు అప్రమత్తమై చాలాదూరం చేజ్‌ చేసుకుంటూ వెళ్లినా అప్పటికే రేవంత్‌రెడ్డి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఈ ఘటనలో ఎస్ఐ నవీన్ రెడ్డికి గాయాలయ్యాయి. మిగతా పోలీసులను కూడా నెట్టుకుంటూ వెళ్లడంతో వారు కూడా ఇబ్బందులు పడ్డారని పోలీసులు ఆరోపిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై ఎస్ఐ నవీన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రేవంత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్  341, 332తో పాటు 353 కింద నాన్ బెయిలబుల్‌ సెక్షన్ ను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులను తోసేసిన విజువల్స్ ను సైతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సమర్పించారు ఎస్ ఐ నవీన్ రెడ్డి. 

ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవరిని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ నిప్పులు చెరుగుతున్నారు. 

ఇదే అంశంపై సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు, భట్టి విక్రమార్క, సంపత్ కుమార్, కోదండ రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై మండిపడ్డారు.  అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని తీర్మానించుకున్న సంగతి తెలిసిందే. 

ఇకపోతే సోమవారం ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా రేవంత్ రెడ్డి చూపించిన దూకుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ప్రగతిభవన్ గేటు ముట్టడిస్తానని చెప్పినట్లుగానే ముట్టుకున్నారు. అంతేకాదు పోలీసులు పద్మవ్యూహాన్ని సైతం ఛేదించి హాట్ టాపిక్ గా నిలిచారు. 

రేవంత్ చూపిన దూకుడు కాంగ్రెస్ పార్టీకి ఎంత కలిసివచ్చిందో లేదో తెలియదు గానీ సీనియర్లకు మాత్రం కోపం తెప్పించింది. అటు పోలీసులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఓవరాల్ గా రేవంత్ రెడ్డి చిక్కుల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. 

ఈ వార్తలు కూడా చదవండి

అన్నంత పనే చేశారుగా: ప్రగతిభవన్ ను తాకిన రేవంత్ రెడ్డి, అరెస్ట్

ప్రగతి భవన్ ముట్టడి: పోలీసుల పద్మవ్యూహాన్ని ఛేదించిన రేవంత్, జగ్గారెడ్డి