హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావుపై టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎంగిలి సిగరెట్లు ఏరి పారేసే వ్యక్తిగా అతన్ని అభివర్ణించారు. అలాంటి వ్యక్తితో ఆర్టీసీ కార్మికుల మనోభావాలు దెబ్బ తినే విధంగా వ్యాసాలు రాయిస్తున్నారని ఆయన కేసీఆర్ పై మండిపడ్డారు. 

కార్మిక సంఘాల వల్ల ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని, కార్మికులది తెలివి తక్కువ పని అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎవరిది తెలివి తక్కువ పనో ప్రజలే సమాధానం చెప్తారని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

నిరూపిస్తే ఉరేసుకుంటా...

తాను అక్రమాస్తులు కూడబెట్టానని దుష్ప్రచారం చేస్తున్నారని, తనకు సెంట్ భూమి కూడా లేదని, తన ఆస్తులపై బహిరంగ న్యాయవిచారణకు సిద్ధమని అశ్వత్థామ రెడ్డి అన్నారు. తాను అక్రమాస్తులు సంపాదించినట్లు విచారణలో తేలితే ఉరేసుకుని చచ్చిపోతానని ఆయన అన్నారు. 

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అశ్వత్థామ రెడ్డి అన్నారు. మంత్రి హరీష్ రావుపై ఆర్టీసీ కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, హరీష్ రావు మౌనం తెలంగాణ సమాజానికి మంచిది కాదని ఆయన అన్నారు. 

Also Read: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక ఉత్తర్వులు: కేసీఆర్ పై అశ్వత్థామరెడ్డి గరంగరం...

కొందరు మంత్రులు లోలోపల కుమిలిపోతున్నారని, వారు పదవులకు రాజీనామాలు చేసి ప్రజా క్షేత్రంలోకి రావాలని అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. అవసరమైతే వారిని తాము మళ్లీ గెలిపిస్తామని ఆయన అన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ కోసం పోరాటం చేయడం లేదని, యావత్తు తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నారని అశ్వత్థామ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యం బతకి బట్ట కట్టాలంటే అందరూ ఉద్యమంలోకి రావాలని ఆయన అన్నారు. 

ఆర్టీసీ జెఎసి ఇచ్చిన పిలువు మేరకు శనివారం బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ జేఎసి నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ప్రజా, ప్రైవేట్ రవాణా వ్యవస్థ తెలంగాణలో స్తంభించిపోయింది. ఆర్టీసీ డిపోల వద్ద పెద్ద యెత్తున పోలీసులు మోహరించారు. 

Also Read: ఆర్టీసీ నష్టాలపై మహిళా కండక్టర్ ను పంపిస్తా, చర్చకు సిద్ధమా: కేసీఆర్ కు అశ్వత్థామరెడ్డి సవాల్...