హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రెండు యూనియన్లతో శనివారం చర్చలు జరపాలని ఆదేశించింది. చర్చల సారాంశాన్ని ఈనెల 28న ధర్మాసనానికి వివరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. 

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో సగానికిపైగా డిమాండ్లు సులువుగా పరిష్కారమయ్యేవని తెలిపింది. ఆర్టీసీ కార్మికులు 26 డిమాండ్లను ప్రస్తావించారని వాటిలో సగానికి పైగా డిమాండ్ల ఆమోదయోగ్యమైనవేనని సహృదమైన వాతావరణంలో చర్చలు నిర్వహించాలని కోర్టు స్పష్టం చేసింది. 

హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తాము చర్చలకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. అయితే సమ్మె విరమించి మాత్రం చర్చలకు వెళ్లే ప్రసక్తేలేదని తెలిపారు. చర్చలు చర్చలే సమ్మె సమ్మేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఆర్టీసీ యాజమాన్యం సమ్మె చట్ట విరుద్ధమంటూ ఆర్టీసీ కార్మికులను భయభ్రాంతులు చేసేలా హైకోర్టులో వాదనలు వినిపించిందని ఆరోపించారు. కార్మికుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని మండిపడ్డారు. 

గతంలో కూడా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించిందని అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం స్పందించలేదని తెలిపారు. చర్చలకు పిలవకపోగా ఆర్టీసీ కార్మికుల మనోభవాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన పత్రికలు, న్యూస్ ఛానెల్స్ లలో ఆర్టీసీ కథ కంచికేనంటూ కథనాలు రాయిస్తున్నారని అవి సరికాదంటూ అశ్వత్థామరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం చర్చలు జరపాలని నిలదీశారు. 

ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకుని ఆర్టీసీ యాజమాన్యానికి హైకోర్టు గట్టిగా స్పష్టం చేసిందని తెలిపారు. ఉభయులు చర్చించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించినట్లు చెప్పుకొచ్చారు అశ్వత్థామరెడ్డి. 

ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ప్రభుత్వం ఆహ్వానిస్తే మంచిదేనన్నారు. చర్చలకు పిలిస్తే ఏవి సాధ్యమైన డిమాండ్లు, ఏవీ అసాధ్యమైన డిమాండ్లో తేలుతుందన్నారు. కానీ తమ 26 డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని చెప్పుకొచ్చారు. 

సమ్మెపై చర్చల నేపథ్యంలో సమ్మె యథావిథంగా కొనసాగుతుందని, బంద్ కొనసాగుతుందని తెలిపారు. చర్చలకు సమ్మెకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయిన తర్వాతే సమ్మె విరమింపజేస్తామని తెలిపారు. 

ఈ సందర్భంగా పలు మీడియా సంస్థలపై అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఇంకెన్నాళ్లు బానిస బతుకులు బతకాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో యావత్ తెలంగాణ సమాజం కదిలి వచ్చిందని అందులో భాగస్వామ్యం కావాలని కోరారు. అంతేగానీ తమపై తప్పుడు వార్తలు రాసి తమ మనోభవాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అశ్వత్థామరెడ్డి హెచ్చరించారు.