ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్య నిర్ణయం.. బీఎస్పీకి రాజీనామా
బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. బరువెక్కిన హృదయంతో బహుజన్ సమాజ్ వాదీ పార్టీని వీడుతున్నానని ప్రకటించారు. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనని వెల్లడించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పకుంటున్నట్టు ప్రకటించారు. ఇది తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి బీఎస్పీ పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. కానీ ఈ లోపే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేశారు.
సార్వత్రిక ఎన్నికలకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ రాజీవ్ కుమార్
ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’లో స్వయంగా వెల్లడించారు. ‘‘పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీయస్పీ- బీఆరెస్ పొత్తు వార్త భయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను.’’ అని ఆయన పేర్కొన్నారు.
అదే ట్వీట్ లో ‘‘ప్రియమైన తోటి బహుజనులకు.. నేను ఈ మెసేజ్ ను టైప్ చేయలేను, కానీ ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకునే సమయం వచ్చింది.. దయచేసి నన్ను క్షమించండి. నాకు వేరే మార్గం లేదు. బరువెక్కిన హృదయంతో బహుజన్ సమాజ్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను. నా నాయకత్వంలో తెలంగాణలో ఇటీవల తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ గొప్ప పార్టీ ప్రతిష్ట దెబ్బతినడం నాకు ఇష్టం లేదు. ’’ అని ఆయన పేర్కొన్నారు.