Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో రౌడీషీటర్ దారుణహత్య.. లొంగిపొమ్మన్నందుకు ఘాతుకం.. మరో ఇద్దరిని చంపుతానని సవాల్...

హైదరాబాద్ లో ఓ రౌడీషీటర్ ను మరో రౌడీషీటర్ హత్య చేశాడు. తనను లొంగిపొమ్మన్నాడని కోపంతో అతి దారుణంగా హతమార్చాడు. 

rowdy sheeter brutal murder in Hyderabad - bsb
Author
First Published Oct 16, 2023, 7:16 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ రౌడీ షీటర్, మరో రౌడీషీటర్ ను కత్తులతో పొడిచి హత్య చేశాడు. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నాడని, పోలీసులకు లొంగిపోవాలని హితవు చెప్పినందుకు దారుణంగా హతమార్చాడు. సదరు నిందితుడైన రౌడీషీటర్ తాను లొంగిపోవడానికి ముందు తన టార్గెట్లో మరో ఇద్దరు ఉన్నారని.. వారిని హత్య చేసిన తర్వాతే లొంగిపోతానంటూ చెబుతూ…పోలీసులకు పెను సవాల్ గా మారాడు.

ఈ దారుణ హత్య ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీని మీద స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖూనీ గౌస్ రాజేంద్రనగర్ డైరీ ఫామ్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్. ఇప్పటికే గౌస్ పై అనేక కేసులు ఉన్నాయి. అతని మీద అత్యాచారం, దోపిడీ, హత్య, హత్యాయత్నం,  భయభ్రాంతులకు గురి చేయడం లాంటి కేసులు నమోదయ్యాయి. ఖూనీ గౌస్ పై పీడీ యాక్ట్ కూడా ఉంది. ఈ యాక్ట్ పై జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. గత నెలలో జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత తన గ్యాంగ్ తో తన పాత సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నాడు.

కరెంట్ షాక్.. పొలంలో తండ్రీకొడుకుల దుర్మరణం.. వెంట వెళ్లిన పెంపుడు కుక్క కూడా..

ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చి అనేక కేసుల్లో ఉన్న ఖూనీ గౌస్.. ఈసారి పకడ్బందీగా తన కార్యకలాపాలు నిర్వహించాలనుకున్నాడు. ఇందుకోసం..  తన కదలికలపై పోలీసులకు సమాచారం అందకుండా చూసుకోవాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.  ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం తన కదలికల మీద పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడని ఓ వ్యక్తిపై అనుమానించాడు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫార్మ్ దగ్గర…పాలు విక్రయించే ఓ వ్యక్తి దుకాణం మీద దాడి చేశాడు.

పట్టపగలే ఆ పాల దుకాణాన్ని మంటలకు ఆహుతి చేశాడు. అడ్డు వచ్చిన వారిని కత్తులతో బెదిరించాడు. ఎవరికీ చిక్కకుండా పారిపోయాడు. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకోలేక పోయారు. ఈ క్రమంలోనే రాజేంద్రనగర్ కు చెందిన మరొక రౌడీషీటర్ ఇందులో కలగజేసుకున్నాడు. సర్వర్ (30) అనే రౌడీషీటర్ ఖూనీ గౌస్ ను కలుసుకుని, పోలీసులకు లొంగిపోవాలని, గొడవలొద్దని హితవు పలికాడు.

ఇది ఖూనీ గౌస్ కు నచ్చలేదు. శుక్రవారం అర్థ రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఖూనీ గౌస్ సర్వర్ కు ఫోన్ చేద్దామని జనప్రియ వెంచర్ ప్రాంతంలోని మొండి ఖత్వాకు రమ్మని పిలిచాడు.అతని మాటలను నమ్మి అక్కడికి వచ్చిన సర్వర్ ను కత్తులతో విశిష్టత రహితంగా దాడి చేసి చంపాడు. పోలీసులకు లొంగిపొమ్మని తనకే చెబుతావా అంటూ కోపానికి వచ్చాడు.  ఈ దాడిలో సర్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో అతనితో పాటు అక్కడ ఉన్న స్నేహితులతో… ‘నా టార్గెట్లో మరో ఇద్దరు ఉన్నారు. వాళ్లను కూడా హతమార్చిన తర్వాత  పోలీసులకు  లొంగిపోతా’  అని చెప్పి పారిపోయాడు. 

ఈ విషయం రాజేంద్రనగర్ పోలీసులకు తెలియడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.  సర్వార్ మృతదేహాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య మీద స్థానికులు  పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. ఖూనీ గౌస్ ఆగడాలు  పెరిగిపోయాయని ఐదు రోజుల క్రితమే డైరీ ఫార్మ్ దగ్గర జరిగిన దాడిలో నిందితుడైన గౌస్ ను అప్పుడే అరెస్టు చేస్తే ఈ హత్య జరిగేది కాదంటున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ హత్య జరిగిందన్నారు.  అత్తాపూర్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో జరిగిన సంఘటనలు ఖూనీ గౌస్ ఎంత కిరాతకంగా వ్యవహరిస్తాడో తెలుపుతాయని స్థానికులు తీవ్రభయాందోళనలతో  చెబుతున్నారు.వెంటనే ఖూనీ గౌస్ పై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios