తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన బ‌స్సు యాత్ర అట్ట‌ర్ ఫ్లాప్ షోగా మిగిలిపోతుందన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కాంగ్రెస్ నీచ‌మైన రాజకీయాలు చేస్తోందన్నారు. ఆ పార్టీ నేతలు సంస్కారం లేకుండా మూర్ఖ‌త్వంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవ‌రెన్ని యాత్రలు చేసినా..2019లో టీఆర్ఎస్ పార్టీయే మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిర్మ‌ల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బ‌స్సు యాత్ర అట్ట‌ర్ ఫ్లాప్ షో అయిందన్నారు.

ఇన్నేళ్ల పాల‌న‌లో కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిందేమి లేద‌ని వెల్ల‌డించారు.  నిర్మ‌ల్ జిల్లా ప్ర‌జా చైత‌న్య‌ బ‌స్సు యాత్ర‌లో కాంగ్రెస్ పార్టీ చేసిన విమ‌ర్శ‌ల‌ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తిప్పి కొట్టారు.  నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన బ‌స్సు యాత్ర‌కు ప‌ట్టుమ‌ని ప‌ది వేల మంది కూడా రాలేద‌న్నారు.

సిఎం కేసీఆర్, కేటీఆర్ ల‌ను విమ‌ర్శిస్తూ..ప‌బ్లిసిటీ కోసం  రేవంత్ రెడ్డి పిచ్చి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని మంత్రి అల్లోల ఫైర‌య్యారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మాత్ర‌మే అన్న విష‌యం మ‌ర్చిపోవ‌ద్ద‌న్నారు. త‌న నియోజ‌కవ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఏం చేయ‌లేనోడు... రాష్ట్ర‌మంతా తిరుగుతున్నాడ‌ని ఎద్దేవా చేశారు. 

మాజీ ఎమ్మెల్యే మ‌హేశ్వ‌ర్ రెడ్డి స‌న్యాసం తీసుకునే రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌న్నారు. సాధ‌ర‌ణ‌ ఎన్నిక‌ల్లో ఓడిపోతే రాజకీయ స‌న్యాసం తీసుకుంటునన్నా...మ‌హేశ్వ‌ర్ రెడ్డిని వ‌చ్చేఎన్నిక‌ల్లో ఓడించి ప్ర‌జ‌లే అడ‌వుల్లోకి పంపుతార‌న్నారు. సీయం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల‌ను విమ‌ర్శించే స్థాయి మ‌హేశ్వ‌ర్ రెడ్డికి లేద‌న్నారు. తెలంగాణ ఉద్య‌మంలో నీ పాత్ర ఎంటో చెప్పాల‌ని మ‌హేశ్వ‌ర్ రెడ్డిని నిల‌దీశారు.