తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, పార్టీ విస్తరణ,బహిరంగ సభలపై రేవంత్ ఢిల్లీ పర్యటనలో చర్చించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సోమవారం ఉదయం ఢిల్లీకి (Delhi) వెళ్లనున్నారు. ఉదయం 10.20 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరనున్న ఆయన, అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్ర కేబినెట్‌లో కొత్తగా ఎంపికైన మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చ జరుగనుంది.
కొత్త మంత్రులకు శాఖలు..
తాజాగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురు మంత్రులకు ఇప్పటికే శాఖలు కేటాయించాల్సిన దశకు చేరుకుంది. వారిలో గడ్డం వివేక్‌కు కార్మిక, మైనింగ్, క్రీడల శాఖలు, అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ, వాకిటి శ్రీహరికి పశుసంవర్థక, యువజన, న్యాయ లేదా మత్స్య శాఖలు కేటాయించే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. ప్రభుత్వం సోమవారం లేదా మంగళవారం ఈ విషయంపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశముందని సమాచారం.
ప్రస్తుతం సీఎం వద్ద ఉన్న శాఖలు పలు కీలక రంగాలకు సంబంధించినవే. విద్య, హోం, మైనార్టీ సంక్షేమం, పురపాలక, కమర్షియల్ ట్యాక్స్, మైన్స్, క్రీడలు వంటి శాఖలు ఇంకా ఏ మంత్రికి కేటాయించలేదు. ఈ శాఖలే కొత్తగా నియమితులైన మంత్రులకు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి, పార్టీ విస్తరణపై కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా జిల్లా స్థాయి నాయకత్వాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టనున్నారు. అంతేకాక, ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణనలపై భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు పార్టీ దృష్టి సారించనుంది. ఈ సభల తేదీలను ఢిల్లీలోనే తుది నిర్ణయానికి తీసుకునే అవకాశం ఉంది.