బీఆర్ఎస్ కోటకు బీటలు: పొంగులేటి , జూపల్లిపై రేవంత్ ఆసక్తికరం
జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు తనకు స్నేహితులని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ కోటకు బీటలు పడుతున్నాయని టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. సోమవారంనాడు హైద్రాబాద్ గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు . పొంగుటేటి శ్రీనివాస్ రెడ్డి , జూపల్లి కృష్ణారావుల తిరుగుబాటుతో బీఆర్ఎస్ కోటలు బీటలు పడినట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు. జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు తనకు పాత మిత్రులేనని ఆయన చెప్పారు. జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తనతో సహచర ప్రజా ప్రతినిధిగా ఉన్నాడని ఆయన గుర్తు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు తెలుసునన్నారు. కేసీఆర్ చేతిలో మోసపోయిన వారిని చూస్తే తనకు సానుభూతి కలుగుతుందని ఆయన చెప్పారు.
కేసీఆర్ ను నమ్ముకుంటే పొంగులేటి శ్శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీ, జూపల్లి కృష్ణారావు మాజీ ఎమ్మెల్యే అయ్యాడని ఆయన గుర్తు చేశారు.
also read:సంచలన నిర్ణయాలకు కేరాఫ్ జూపల్లి: నాడు కాంగ్రెస్‌కు , నేడు బీఆర్ఎస్‌కు దూరం
కేసీఆర్ ను నమ్ముకున్న వారిలో అనేక మంది మోసానికి గురయ్యారన్నారు.కేసీఆర్ ను నమ్ముకున్న వారిలో మండవ వెంకటేశ్వరరావు, కడియం శ్రీహరి, పట్నం మహేందర్ రెడ్డిలు మోసానికి గురయ్యారన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జూపల్లి కృష్ణారావుల ఇళ్ల వద్దకు నేను వెళ్తానో , వారే తమ పార్టీ ఆఫీసుకు వస్తారో భవిష్యత్తు నిర్ణయిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జూపల్లి కృష్ణారావులను ఇవాళ బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ ఇద్దరు నేతలపై ఇవాళ బీఆర్ఎస్ చర్యలు తీసుకుంది. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ గత కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేస్తున్నారు. కానీ ఇవాళ ఈ ఇద్దరిపై చర్యలు తీసుకుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జూపల్లి కృష్ణారావులు ఏ పార్టీలో చేరుతారనేది ప్రస్తుతంఅంతా ఆసక్తిగా చూస్తున్నారు. కాంగ్రెస్ , బీజేపీల నుండి ఈ ఇద్దరు నేతలకు ఆహ్వానాలున్నాయి. కానీ ఏ పార్టీలో చేరే విషయమై వీరిద్దరూ ఇంకా ప్రకటించలేదు.
సస్పెన్షన్ విధించిన తర్వాత బీఆర్ఎస్ పై జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనవాస్ రెడ్డిలు విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కకుండా చూస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గడీల పాలన నుండి విముక్తి లభించిందని జూపల్లి కృష్ణారావు చెప్పారు.