Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికలకు ముందూ, తరువాత రైతుబంధు చుట్టూ ఏం జరిగిందంటే...

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుండడంతో రైతుబంధుతో ఇరకాటంలో పెడదామనుకున్న ప్రతిపక్షాల ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిప్పి కొట్టారు. 

Revanth Reddy check for Rythubandhu politics - bsb
Author
First Published Dec 12, 2023, 7:33 AM IST

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందునుంచి రైతుబంధు నిధుల విడుదల విషయంలో రాజకీయం నడుస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇలా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో.. దీన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షంగా మారిన బీఆర్ఎస్ దాడి మొదలు పెట్టింది. బీఆర్ఎస్ నేత హరీష్ రావు రైతుబంధు ఎప్పుడు వేస్తారంటూ రెండు రోజుల క్రితమే విమర్శలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో రైతుబంధు నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. 

అసలు ఈ రైతుబంధు చుట్టూ గత నెలరోజులుగా ఎలాంటి రాజకీయాలు నడిచాయంటే...ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే వారం రోజుల ముందునుంచే అంటే నవంబర్ 21నుంచి రైతుబంధు పంపిణీ నిలిపివేయాలని జాతీయ ఎన్నికల కమిషన్  ఆదేశాలు జారీ చేసింది. ఖరీఫ్, రబీ సీజన్ లకు గానూ తెలంగాణ ప్రభుత్వం యేటా ఎకరాకి రూ. 10వేల చొప్పున రెండు విడతల్లో పంటసాయం అందిస్తుంది. రబీ సీజన్ నేపథ్యంలో ఇవ్వాల్సిన నిధులు విడుదలకు ఎన్నికలు అడ్డొచ్చాయి. 

Rythu Bandhu: ఖాతాలో డబ్బులు పడ్డాయా?.. రైతు భరోసా నిధులు విడుదల చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం

దీంతో వెంటనే అప్పటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్, కేసీఆర్ సర్కార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. రైతులకు రైతుబంధు నిధుల విడుదలకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేసింది. దీన్ని పరిశీలించిన ఎన్నికల కమిషన్ నవంబ్ 24న రైతుబంధు పంపిణీకి అనుమతినిచ్చింది. దీంతో, సుమారు 7వేల కోట్ల రూపాయల నిధులను దశల వారీగా రైతుబంధు రూపంలో రైతులు ఖాతాల్లో వేయడానికి మార్గం సుగమం అయ్యింది. 

బీఆర్ఎస్ కు బిగ్ షాక్

అయితే, వరుసగా వచ్చిన బ్యాంక్ సెలవులతో రైతుబంధు ఆలస్యం అయ్యింది. 24 నుంచి 28వ తేదీ వరకు మాత్రమే రైతుబంధు పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. కానీ 24నుంచి బ్యాంకుల సెలవులు ఉండడంతో రైతుబంధు నిధుల విడుదలకు ఒక్క 28వ తేదీ మాత్రమే మిగిలి ఉంది. ఈ మేరకు 28వతేదీ నాడు సుమారు 7000 కోట్ల రూపాయల రైతుబంధు నిధులు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయ్యింది.

కానీ అంతలోనే నవంబర్ 27వ తేదీన ఈసీ రైతుబంధు నిధుల పంపిణీకి అనుమతిని ఉపసంహరించుకుంది. దీంతో బీఆర్ఎస్ సర్కారుకు భారీ షాక్ తగిలినట్లు అయింది. రెండు రోజుల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు నిధులు విడుదల చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని ఈసి స్పష్టం చేసింది. దీంతో రైతుబంధు నిధుల పంపిణీ ఆగిపోయింది. 

మరోవైపు.. మొదట రైతుబంధు నిధుల పంపిణీని ఆపివేసి, ఆ తర్వాత మళ్లీ అనుమతి ఇవ్వడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ కు దీనిమీద ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నవంబర్ 30వ తేదీ పోలింగ్ పెట్టుకొని.. 28వ తేదీ లోపు రైతుబంధు నిధులకు అనుమతి ఇవ్వడమేమిటంటూ.. ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇక్కడే ట్విస్ట్ పడింది. 

దెబ్బకొట్టిన హరీష్ రావ్ వ్యాఖ్యలు..

నవంబర్ 26వ తేదీన ఎన్నిక ప్రచార సభలో మాట్లాడుతూ అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రైతుబంధు మీద వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 27వ తేదీ ఉదయానికల్లా రైతుబంధు నిధులు పడతాయని.. ఉదయం లేచి ఛాయ తాగే లోపే నిధులు జమ అయినట్టుగా టింగు టింగు మంటూ ఫోన్లు మోగుతాయని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల మీద ప్రతిపక్ష పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఈసీ వెంటనే నవంబర్ 27వ తేదీన రైతుబంధు నిధుల విడుదలకు మళ్లీ బ్రేకులు వేసింది. 

దీనికి కారణం చెబుతూ..నవంబర్ 27న రైతుబంధు నిధులు వేయడానికి బ్యాంకులకు సెలవు ఉంది.. నవంబర్ 28న నిధులు పడాలి. నవంబర్ 30న ఎన్నికలు.. ఒక్కరోజు ముందు నిధులు పడడం అంటే ఓటరును మభ్య పెట్టినట్టే అంటూ నిధుల విడుదలను ఆపేయాలని ఆదేశించింది. 

ఆ సమయంలో రైతుబంధు ఆగడానికి కాంగ్రెస్ కారణం అని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి. నిజానికి రైతుబంధు ఆగడానికి హరీష్ రావు అతివాగుడే కారణం అన్నారు. రైతుబంధు రాకుండా చేసిన  బిఆర్ఎస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతుబంధు పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు ఎకరాకు రూ. 15000ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ దే అన్నారు. రైతు బందు ఇవ్వాలని ఈసీకి మేము విజ్ఞప్తి చేశాం ఈజీ కూడా అనుమతిని ఇచ్చింది. కానీ బీఆర్ఎసే రైతుబంధును అడ్డుకుందన్నారు. 

దీనిమీద హరీష్ రావు వెంటనే కౌంటర్ ఇచ్చారు. తాను ఎన్నికల ప్రచార సభలో రైతుబంధు పంపిణీకి ఈసీ అనుమతి ఇచ్చిందని చెప్పానని, దీంట్లో తప్పేముందని హరీష్ రావు  ప్రశ్నించారు. ఓ సభలో హరీష్ రావు మాట్లాడుతూ.. నవంబర్ 27న ఉదయం మీరు టీ తాగే సమయానికి మీ ఫోన్లో రైతుబంధు నిధులు పడిన సమాచారం మోగుతుందని అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న ఎలక్షన్ కమిషన్ రైతుబంధును నిరాకరించింది. దీనిమీద హరీష్ రావు మాట్లాడుతూ తాను మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. రైతుల నోటికాడి  ముద్దను కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు. తాను తప్పేం మాట్లాడలేదని.. ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. 

కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతోనే ఈసీ రైతుబంధుకు అనుమతి నిరాకరించిందన్నారుహరీష్ రావు . రైతు బంధును ఎన్ని రోజులు ఆపుతారని  ప్రశ్నించారు. డిసెంబర్ 3 వరకు ఆపగలరని ఆ తర్వాత మళ్లీ వచ్చేది, ఇచ్చేది కేసీఆరేనని చెప్పుకొచ్చారు. మంత్రి హరీష్ రావు జహీరాబాద్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఈ మేరకు ప్రసంగించారు. కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు రైతుబంధుపై ఫిర్యాదు చేశారని మండిపడ్డారు.

కాంగ్రెస్ వాళ్లు రైతులకు ఇవ్వరని..  ఇచ్చిన వాళ్లను అడ్డుకునేటమే వారి పని అని చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా రైతుబంధు ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఈ పదేళ్లలో కెసిఆర్ ప్రభుత్వం రైతులపై ప్రేమతో 11 సార్లు రైతుబంధును ఇచ్చిందని ఓట్ల కోసం కాదని తెలిపారు.

తిప్పి కొట్టిన రేవంత్ రెడ్డి

నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఒక్కరోజు తరువాత హరీష్ రావు రైతుబంధు మీద ప్రశ్నలు కురిపించారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వస్తే డిసెంబర్ 9వ తేదీన 15000 రూపాయలు చొప్పున రైతుబంధు డబ్బులు వేస్తామని చెప్పారని.. ఎప్పుడు వేస్తారని డిసెంబర్ 9న ప్రశ్నించారు. 

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుండడంతో రైతుబంధుతో ఇరకాటంలో పెడదామనుకున్న ప్రతిపక్షాల ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిప్పి కొట్టారు. రైతుబంధు నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. రైతుబంధు అర్హులకు కాకుండా ఇతరులకు సహాయకారిగా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కొన్ని మార్పులు చేయనున్నారు. అయితే.. ఇంకా 
రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేయడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

గతంలో రైతు బంధు పథకం లబ్దిదారులకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, రూ. 2 లక్షల వరకు రుణ మాఫీ పైనా కార్యచరణ, ప్లానింగ్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెక్ పెట్టినట్టయ్యింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios