Asianet News TeluguAsianet News Telugu

రాజీనామా లేఖలోనూ కేసిఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్

  • రాజీనామా లేఖలో సింహభాగం కేసిఆర్ ను విమర్శించిన రేవంత్
  • తెలంగాణలో కేసిఆర్ పాలనా తీరుతెన్నులను వివరించిన రేవంత్
  • కేసిఆర్ ను గద్దె దించడం కోసమే పార్టీని వీడుతున్నట్లు వెల్లడి
Revanth didnt spare kcr even in his resignation letter from TDP
  • Facebook
  • Twitter
  • Whatsapp

రెబెల్ రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను అమరావతిలో అందజేశారు. మూడు పేజీల రాజీనామా లేఖలో అనేక అంశాలు వెల్లడించారు రేవంత్. అయితే అందులో తను పార్టీలో ఎలా ఎదిగింది, అధినేత ఎలా అవకాశాలిచ్చింది, కార్యకర్తలతో తనకున్నబంధం లాంటి అంశాలపై రేవంత్ వివరణ ఇచ్చారు. ఇది ఇలా ఉంచితే.. రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖలోనూ తెలంగాణ సిం కేసిఆర్ మీద విరుచుకుపడ్డారు. కేసిఆర్ తీరును ఎండగడుతూ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కేసిఆర్ పాలనలో జనాలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో లేఖలో వివరించారు. కేసిఆర్ గురించి రేవంత్ వెల్లడించిన అంశాలివి.

కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు చిన్నాబిన్నమయ్యాయి. ఏ వర్గాన్ని తట్టి చూసినా కష్టాలు కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వేల మంది రైతులు పిట్టల్లా రాలుతున్నా పట్టించుకున్న పాపానపోలేదు. గిరిజన రైతులకు బేడీలు వేసి ఆత్మగౌరవం దెబ్బతీశారు. మల్లన్న సాగర్ ను రావణకాష్టంగా మార్చారు. నేరేళ్లలో దళిత, బీసీ బిడ్డలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. భూపాలపల్లిలో గుత్తికోయల ఆడబిడ్డలను బట్టలూడదీసి చెట్లకు కట్టేసి కొట్టారు. ఇలాంటి హృదయవిదారక సందర్భాలు అనేకం. ప్రతిపక్షాల ఉనికిని కేసీఆర్ సహించలేకపోతున్నారు.

ప్రజాస్వామిక హక్కులకు రాష్ట్రంలో చోటు లేదు. వ్యవస్థల పతనం నిరాఘాటంగా సాగుతోంది. ప్రశ్నిస్తే గొంతు నొక్కడం..అసెంబ్లీలో సస్పెన్షన్ లు నిత్యకృత్యమయ్యాయి. నాపై వ్యక్తిగతంగా కక్షగట్టి అక్రమ కేసుల్లో ఇరికించిన విషయం మీకు తెలుసు. జైల్లో పెట్టిన సందర్భంలోనూ నేను వెనకడుగు వేయలేదు. నా బిడ్డ నిశ్చితార్థానికి కోర్టు కొన్ని గంటలు మాత్రమే అనుమతించిన సందర్భంలోనూ గుండెనిబ్బరం కోల్పోలేదు. 

ఆ సమయంలో మీరు, భువనేశ్వరి మేడమ్ కుటుంబ పెద్దలుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయింది. బంగారు తెలంగాణ ముసుగులో ప్రజా సంపద అడ్డగోలుగా దోపిడీ అవుతోంది. అమరవీరుల ఆత్మబలిదానాలకు గుర్తింపు లేదు. తెలంగాణ సమాజం ఏకతాటిపై నిలబడి కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అనివార్యత కనిపిస్తోంది. తెలంగాణ సమాజ హితం కోసం నేను మరింత ఉదృతంగా పోరాడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. తెలంగాణ సమాజం కేసీఆర్ కు వ్యతిరేకంగా బలమైన రాజకీయ పునరేకీకరణ కోరుకుంటోంది. నా నిర్ణయాన్ని ఆ కోణంలోనే చూడండి.

కార్యనిర్వాహక అధ్యక్ష పదవి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం, శాసన సభ సభ్యత్వానికి రాజీనామ చేస్తున్నాను. తెలంగాణ హితం కోసం మరింత విస్తృత పోరాటానికి సిద్ధమవుతున్నాను. అన్యదా భావించక నా నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/jZLKb4

Follow Us:
Download App:
  • android
  • ios