తెలుగుదేశం పార్టీలో రేవంత్ ఎపిసోడ్ ఎటు మలుపు తిరగనుంది? రేపు రేవంత్ అమరావతికి పోతడా? పోడా? ఒకవేళ అమరావతి పోతే రేవంత్ ఏం మాట్లాడతాడు? ఆయన ఏం డిమాండ్లు అధినేత చంద్రబాబు ముందు ఉంచుతాడు? ఆయన డిమాండ్లకు బాబు సమ్మతిస్తడా? తిరస్కరిస్తడా? అమరావతిలోనే రేవంత్ తాడోపేడో తేల్చుకుంటడా? హైదరాబాద్ వచ్చినంక డిసైడ్ చేసుకుంటడా? ఇప్పుడు రేవంత్ అనుచరులతోపాటు టిడిపి వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చలు. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని యావత్ రాజకీయ వర్గాల్లో ఈ చర్చలే సాగుతున్నాయి.

రేపు ఉదయం అమరావతికి రాండి.. మిగతా విషయాలు డిస్కస్ చేద్దాం... అని టిడిపి అధినేత చంద్రబాబు రేవంత్ సహా ముఖ్యమైన తెలంగాణ నేతలకు చెప్పారు. ఇవాళ చూచాయిగా లేక్ వ్యూ గెస్ట్ లో కొద్దిసేపు ముచ్చటించారు బాబు. అయితే డిటైల్ గా రేపు చర్చించనున్నారు. మరి ఇంతవరకు బాగానే ఉన్నా... అసలు రేవంత్ రేపు అమరావతి పోతడా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ విషయమై రేవంత్ తన సహచరులు, సన్నిహితులు, అనుచరులతో వేర్వేరుగా సంప్రదింపులు జరుపుతున్నారు. తన శ్రేయోభిలాషులతో చర్చిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయమై రేవంత్ శిబిరం నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. ఆయన వెళ్లేది లేనిది మాత్రం రాత్రి వరకు తేలే అవకాశముందని రేవంత్ రెడ్డి సన్నిహితుడైన ఉమ్మడి పాలమూరు వాసి ఒకరు ఏషియానెట్ కు చెప్పారు.

రేవంత్ రెడ్డి ఇవాళ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో కొద్ది నిమిషాల పాటు చంద్రబాబుతో ఏకాంతంగా మాట్లాడారు. కానీ ఆయన చెప్పాలనుకున్న విషయాలు కానీ... క్లారిటీ ఇవ్వాలనుకున్న అంశాలు కానీ పూర్తి స్థాయిలో చర్చించేందుకు అవకాశం ఏర్పడలేదు. బాబుకు అంత సమయం కూడా లేకపోవడంతో ఆయన బెజవాడ వెళ్లిపోయారు. ఇక తెలంగాణ ముఖ్య నేతల సమావేశంలో కూడా రేవంత్ అంశం చర్చకు వచ్చింది. సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్ ఈ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేయగా బాబు వారించారు. ఆ సమయంలో రేవంత్ వ్యూహాత్మకంగా మౌనంగా ఉండిపోయారు.

ఈ రోజు జరిగిన పరిణామాలు చూస్తే రేవంత్ రెడ్డి రేపు అమరావతి కచ్చితంగా పోవొచ్చని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఎందుకంటే గత పదిరోజులుగా ఆయనే కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో వివాదాలు రేగాయి. బాబు వచ్చాక ఆయనను కలిసిన తర్వాతే తాను మాట్లాడతానని రేవంత్ పదే పదే అన్నారు. దీంతో చంద్రబాబే స్వయంగా రేపు అమరావతికి రా అన్న తర్వాత పోకపోతే రేవంత్ దే తప్పు అవుతుంది కదా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. పైగా రేవంత్ పదే పదే తాను అధినేతకే వివరణ ఇస్తాను తప్ప ఇంకెవరికీ కాదన్న మాటలు కూడా అన్నారు.  ఈపరిణామాలు చూస్తే రేవంత్ రేపు అమరావతి వెళ్లి తన ఆలోచనలను, అంచనాలను అధినేత కు వివరించడం ఖాయమని చెబుతున్నారు. ఒకవేళ టిడిపి, టిఆర్ఎస్ పొత్తు విషయంలో రేవంత్ డిమాండ్లకు అధినేత సానుకూలంగా ఉంటే మాత్రం పార్టీ మార్పుపై రేవంత్ పునరాలోచన చేసే అవకాశం ఉందా? అన్నది కూడా రేపే తేలనుంది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/eSvdXQ