Asianet News TeluguAsianet News Telugu

రేవంత్‌కు షాక్: చక్రం తిప్పిన కాంగ్రెస్ సీనియర్లు

పీసీసీ చీఫ్ పదవి విషయంలో కాంగ్రెస్ సీనియర్లు తెర వెనుక చక్రం తిప్పారు. రేవంత్ రెడ్డికి ఈ పదవి దక్కకుండా ఉండేలా ప్లాన్ చేశారనే ప్రచారం సాగుతోంది.. 

Real Congressmen halt Revanth Reddy march
Author
Hyderabad, First Published Sep 6, 2019, 7:35 AM IST

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి రాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు చక్రం తిప్పారనే ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైన సమయంలో కాంగ్రెస్ సీనియర్లు ఈ విషయమై పార్టీ నాయకత్వం  వద్ద తమ నిరసనను వ్యక్తం చేసినట్టుగా సమాచారం.

 దీంతో కొత్త పీసీసీ చీఫ్ నియామకం నిలిచిపోయింది. గురువారం నాడు ఆఘమేఘాల మీద  రాష్ట్ర ఇంచార్జీ కుంతియా కొత్త పీసీసీ నియామకం లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాడు. తనకు బదులుగా మరొకరికి బాధ్యతలను ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు.

ఎఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ప్రస్తుతం కొనసాగుతున్నారు.సంస్థాగత ఎన్నికల్లో భాగంగా అన్ని రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్ లను నియమించే అవకాశం ఉంది. అయితే టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయాలని పార్టీ నాయకత్వం భావించినట్టుగా ప్రచారం సాగుతోంది.

మూడు రోజుల క్రితం ఎంపీ రేవంత్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీని కలిశారు. పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దాదాపుగా నిర్ణయం తీసుకొన్న తరుణంలో అదే పార్టీకి చెందిన సీనియర్లు ఈ నిర్ణయం అమలు కాకుండా విజయవంతంగా నిలిపివేశారనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో నెలకొంది.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ వి.హనుమంతరావులు బుధవారం నాడు రాత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ను కలిశారు.పీసీసీ చీఫ్ నియామకం విషయమై ఆయనతో చర్చించారు.

వేరే పార్టీ నుండి వచ్చిన వారికి పీసీసీ చీఫ్ ఎలా ఇస్తారని హనుమంతరావు రేవంత్ రెడ్డి గురించి పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించినట్టుగా సమాచారం.అంతేకాదు రేవంత్ రెడ్డి ఏబీవీపీలో పనిచేశాడని, ఆర్ఎస్ఎస్ తో కూడ ఆయనకు సంబంధాలు ఉన్న విషయాన్ని వి.హనుమంతరావు అహ్మద్ పటేల్ వద్ద ప్రస్తావించినట్టుగా సమాచారం.

చాలా కాలం పాటు ఆయన టీడీపీలో కొనసాగిన విషయాన్ని కూడ ఆయన గుర్తు చేశారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేస్తే తామంతా కాంగ్రెస్ ను వీడుతామని కొందరు సీనియర్లు అహ్మద్ పటేల్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం.

నిజమైన కాంగ్రెస్ వాదులకు కాకుండా ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి కీలకమైన పదవులను అప్పగించడం వల్ల ప్రయోజనం ఏమిటని కొందరు నేతలు ప్రశ్నించారు.ఈ పరిణామాలను అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం.

ఈ పరిణామాలపై ఎఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్, ఉత్తమ్ కుమార్, మల్లుభట్టి విక్రమార్కలు వార్ రూమ్ లో ఈ విషయమై చర్చించారని తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో కూడ పీసీసీ చీఫ్ పదవి మార్పు విషయమై చర్చించారు. పీసీసీ చీఫ్ ను మారిస్తే నిజమైన కాంగ్రెస్ వాదులకే ఈ పదవిని కట్టబెట్టాలని నేతలు కోరారు.

ఈ సమావేశం  తర్వాత కుంతియా న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పీసీసీ  చీఫ్ మార్పు గురించి చర్చించలేదన్నారు. పీసీసీ చీఫ్ ను మార్చడం లేదన్నారు. వచ్చే మున్సిఫల్ ఎన్నికల్లో విజయం కోసం  అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టుగా కుంతియా మీడియాకు తెలిపారు. ఈ నెల రెండో వారంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు విషయమై సమావేశంలో చర్చించామని కుంతియా తెలిపారు.

సంబంధిత వార్తలు

పీసీసీ చీఫ్ మార్పుపై చర్చే లేదు: కుంతియా
తెలంగాణ పీసీసీ చీఫ్ పగ్గాలు రేవంత్ రెడ్డికేనా?

Follow Us:
Download App:
  • android
  • ios