హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. కొత్త అధ్యక్షుడి రేసులో రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది.

పార్లమెంట్ ఎన్నికల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ గా విజయం సాధించాడు. అంతేకాదు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని ఆయన జాతీయ నాయకత్వాన్ని కూడ కోరారు. దీంతో కొత్త నాయకత్వం ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తును ప్రారంభించింది.

దక్షిణాదిలో బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడ అప్రమత్తమైంది. తెలంగాణలో బీజేపీని ధీటుగా ఎదుర్కొనే నేత కోసం కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలను చేస్తోంది. 

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం ముగిసినా శాసనసభ, లోక్ సభ ఎన్నికల కారణంగానే ఆయననే కొనసాగించారు. ఎఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ నియామకం తర్వాత పీసీసీ చీఫ్ ను ఎంపిక చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించినట్టుగా ప్రచారం సాగుతోంది.

పీసీసీ చీఫ్ పదవిని పలువురు ఆశిస్తున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి పేరు ప్రధానంగా విన్పిస్తున్నట్టుగా సమాచారం. అయితే రేవంత్ రెడ్డి ఇప్పటికే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. రేవంత్ రెడ్డి కాకుండా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడ ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారంలో ఉంది.

పార్టీలో సుధీర్ఘకాలంగా కొనసాగుతున్న మాజీ మంత్రి శ్రీధర్ బాబు పేరు కూడ పరిశీలనలో ఉంది. వివాద రహితుడు, సౌమ్యుడిగా పేరున్న శ్రీధర్ బాబు పేరును పీసీసీ చీఫ్ పదవి కోసం కొందరు ప్రతిపాదించినట్టుగా సమాచారం.

బీసీ సామాజిక వర్గం నుండి పొన్నాల లక్ష్మయ్య , వి.హనుమంతరావు పేర్లు కూడ విన్పిస్తున్నాయి,మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పేరు కూడ పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్టుగా ప్రచారంలో ఉంది. రాజనర్సింహ బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది.అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. గిట్టనివాళ్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.మరో వైపు ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేరు కూడ పీసీసీ చీఫ్ రేసులో ఉంది.

ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం నుండి జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య ఈ విషయమై పోటీ నెలకొన్నట్టుగా ప్రచారం సాగుతోంది.కానీ, ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికిప్పుడే రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇవ్వకపోయినా ఎన్నికల నాటికి ఆయనకు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు. అయితే రేవంత్ కు పార్టీ పగ్గాలు ఇస్తే సీనియర్లు ఒప్పుకొనే పరిస్థితి ఉంటుందా అనేది ప్రస్తుతం నెలకొన్న ప్రశ్న.

రెడ్డి సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్ పదవిని ఇస్తే  ప్రస్తుత కార్యనిర్వాహక అధ్యక్షులు కుసుమ్‌కుమార్‌, పొన్నం ప్రభాకర్‌లను కొనసాగించే అవకాశం ఉందంటున్నారు. అజారుద్దీన్‌ స్థానంలో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అవకాశం ఇస్తారని చెబుతున్నారు.