Asianet News TeluguAsianet News Telugu

ఆ విషయంలో రాయల తెలంగాణ బంధం బలపడింది

రాష్ట్ర విభజనకు ముందు రాయల తెలంగాణ కోసం అప్పట్లో ప్రయత్నాలు బాగానే సాగాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసి రాయలసీమను తెలంగాణలో కలపాలంటూ కొందరు ప్రతిపాదించారు. సీమ నేతలు ఈ ప్రతిపాదన పట్ల చాల పాజిటివ్ గా ఉన్నారు. కానీ తెలంగాణ నుంచి రెస్సాన్స్ రాలేదు. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ దిశగా కసరత్తు చేసినా తుదకు సీమాంధ్ర రాష్ట్రం,  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకే మొగ్గు చూపింది. నాడు రాయల తెలంగాణ రాకపోయినా తాజాగా రాయల తెలంగాణ బంధం  బలపడింది.

Rayalaseema and Telangana coming closer thanks to KCRs Sheep distribution

తెలంగాణలో గొర్రెల పంపిణీ పండగలా సాగుతోంది. సిఎం కెసిఆర్ చొరవతో యాదవ, కుర్మ కుటుంబీకులందరికీ గొర్రెల పంపిణీ యుద్ధ ప్రాతిపదికన అమలు జరుగుతోంది. గత మూడు రోజులుగా అధికాయ యంత్రాంగం అంతా ఇక్కడ గొర్రెల పంపిణీలో మునిగిపోయారు. ఇక్కడ గొర్రెలను పంపిణీ చేసేందుకు చుట్టుపక్కల రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ల నుంచి లక్షల సంఖ్యలో గొర్రెలను కొనుగోలు చేసి తరలిస్తున్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

 

ఈ  విషయంలో తెలంగాణను రాయలసీమ ఆదుకుందని అధికార వర్గాలు చెబుతున్నమాట. రాయలసీమలోని అనంతపురం, కడప జిల్లాతోపాటు కర్నూలు జిల్లాలో కూడా గొర్రెల సంఖ్య లక్షల్లో  ఉంది. అందుకే తెలంగాణ అధికారులు రాయలసీమ మీద దృష్టి కేంద్రీకరించారు. గత మూడు నెలలుగా రాయలసీమలోని అనంతపురం నుంచి పెద్దసంఖ్యలో గొర్రెలను కొనుగోలు చేశారు. తరలింపు కార్యక్రమం ఇప్పుడు జోరుగా సాగుతోంది. ప్రాథమిక అంచనా ప్రకారం అనంతపురం  జిల్లా నుంచి సుమారు 2లక్షల గొర్రెలను తెలంగాణకు తరలించారు. అనంతపురం జిల్లాలో 37 లక్షల  గొర్రెలు ఉండగా అందులో గత మూడు నెలల కాలంలో 2లక్షల గొర్రెల అమ్మకం కోసం తెలంగాణ అధికారులతో బేరం కుదుర్చున్నారు.

 

పెద్ద మొత్తంలో గొర్రెల  కొనుగోలు చేస్తుండడంతో  అనంతపురం గొర్రెలకు రేటు గణనీయంగా పెరిగిపోయిందని చెబుతున్నారు. దీంతో అక్కడి గొర్రెల కాపరులకు మంచి ధర లభించడంతో వారు  ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం తమకు లాభాల పంట పండిస్తోందని సీమ గొర్రెల  కాపరులు అంటున్నారు.

 

మరోవైపు రాయలసీమలో గొర్రెల కొనుగోళ్లపై అక్కడి సర్కారు నజర్ వేసింది. తెలంగాణ అధికారులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి గొర్రెలు కొనుగోలు చేయడం ద్వారా తమకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతుందని ఆంధ్రా మార్కెటింగ్ అధికారులు భావిస్తున్నారు. అందుకే గొర్రెల విక్రయాలు మార్కెట్ యార్డుల ద్వారా జరిగేలా అక్కడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో రాయలసీమ నుంచి  కనీసం మరో మూడు, నాలుగు లక్షల గొర్రెలను తెలంగాణకు అమ్మకం జరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

మొత్తానికి తెలంగాణలో చేపట్టిన భారీ కార్యక్రమం రాయలసీమ గొర్రెల కాపరులకు ప్రయోజనం కలిగించింది. మంచి ధరకు వారు గొర్రెలను అమ్ముకోవడం వల్ల రెండు ప్రాంతాల బంధం బలపడిందని పలువురు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios