Asianet News TeluguAsianet News Telugu

దుబారాతో తెలంగాణను అప్పులపాల్జేశారు: కేసీఆర్ పై రాహుల్ గాంధీ

టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ  జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తన దుబారాతో అప్పులపాల్జేశారని ఆరోపించారు.చార్మినార్ వద్ద రాజీవ్ సద్భాన యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ  మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను రెండు లక్షల కోట్లు అప్పులు చేసేలా దిగజార్చారని విమర్శించారు. 

rahul gandhi slams bjp
Author
Hyderabad, First Published Oct 20, 2018, 6:43 PM IST

 

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ  జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తన దుబారాతో అప్పులపాల్జేశారని ఆరోపించారు. చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన యాత్రలో పాల్గొన్న రాహుల్ మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను రెండు లక్షల కోట్లు అప్పులు చేసేలా దిగజార్చారని విమర్శించారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు కేసీఆర్ ఎంతో నీతితో నిజాయితీతో పనిచేస్తారని ఆశించానని రాహుల్ అభిప్రాయపడ్డారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతారని అనుకున్నానని తెలిపారు. కానీ కేసీఆర్ తెలంగాణలో ప్రజల పాలన కాకుండా కేసీఆర్ కుటుంబ పాలన తీసుకువచ్చారని ఆరోపించారు.

నాలుగున్నరేళ్లకాలంలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని రాహుల్ మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ఎక్కడ ఇచ్చారని నిలదీశారు. తెలంగాణలో రైతుల పాత్ర కీలకమన్న రాహుల్ గాంధీ నాలుగున్నరేళ్ల కాలంలో 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. 

ఎస్సీఎస్టీలకు మూడెకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చారని అది ఎంతమందికి ఇచ్చారని రాహుల్ ప్రశ్నించారు. మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేసిన చరిత్ర టీఆర్ ఎస్ పార్టీదని ధ్వజమెత్తారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. ప్రతీ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానన్నారు కానీ ఎక్కడ నిర్మించారని ప్రశ్నించారు.

తెలంగాణలో నియంత పాలన నడుస్తోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదని, నాలుగేళ్లలో తెలంగాణలో బాగుపడింది కేసీఆర్‌ కుటుంబం ఒక్కటేనని విమర్శించారు. పాతబస్తికి మెట్రో రాలేదని, మెట్రో వస్తే రాత మారుతుందని చిన్న వ్యాపారులు ఆశించారని కానీ నిలిపివేశారన్నారు. 

ఈ నాలుగేళ్లలో పూర్తైంది రూ.300 కోట్లు పెట్టి కట్టుకున్న కేసీఆర్‌ ఇల్లు ఒక్కటేనని విమర్శించారు. విద్య, వైద్యం, నిజాం షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించేందుకు డబ్బులు లేవు కానీ ప్రగతి భవన్ కట్టుకునేందుకు మాత్రం డబ్బులు వచ్చాయా అని విమర్శించారు. 

టీఆర్ఎస్, బీజేపీ,ఎంఐఎంలు కలిసి పనిచేస్తున్నాయని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మూడు పార్టీలు తోడుదొంగలేనని దుయ్యబుట్టారు. పార్లమెంట్ లో బీజేపీకి టీఆర్ఎస్ సహకరిస్తోందని రాహుల్ చెప్పారు. నోట్ల రద్దు వ్యవహారాన్ని అంతా తప్పుబడితే కేసీఆర్ మాత్రం సమర్ధించారని గుర్తు చేశారు. నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ ఏ ఒక్కహామీని నిలబెట్టుకోలేదని దుయ్యబుట్టారు.  

మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బీజేపీ మతం, కులం,భాష పేరుతో దేశాన్ని విడదీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మోదీ దేశంలో విధ్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 

మాజీ భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ లు దేశానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. దేశాన్ని వారంతా ఎంతో అభివృద్ధి చేశారని రాహుల్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు కులమతాలకు అతీతంగా అంతా ఏకమయ్యారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశ పౌరులందరికీ సమాన హక్కులు కల్పించేందుకు రాజ్యాంగాన్ని రాసుకున్నామన్నారు.

ఇవాళ దేశంలో రెండు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాహుల్ అన్నారు. కొందరు దేశాన్ని విభజించు పాలించు అన్న రీతిలో ప్రయత్నిస్తుంటే మరికొందరు దేశంలోని ప్రజలందర్నీ ఏకం చెయ్యాలని చూస్తున్నారని స్పష్టం చేశారు. ఇవాళ దేశంలో మహిళలు ఇంటినుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారన్నారు. దేశంలో ఏ ప్రాంతం వైపు చూసినా భయాందోళనలే కనిపిస్తున్నాయన్నారు. ఈ దేశం కొందరిది కాదని అందరిదీ అని చెప్పడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. 

మరోవైపు నోట్ల రద్దు పిచ్చోళ్లు చేసే పనని ఆర్థిక వేత్తలే అన్నారని రాహుల్ చెప్పారు. నల్లధనం పేరు చెప్పి ప్రజలను ఏటీఎంల దగ్గర క్యూలో నిలబెట్టారని మండపడ్డారు. క్యూలో నిల్చున్నవాళ్లంతా సామాన్యులేనని రాహుల్ తెలిపారు. ధనవంతుల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకే నోట్ల రద్దు అంటూ విరుచుకుపడ్డారు. 

అటు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ,ఎంఐఎం మూడు పార్టీలు తోడు దొంగలేనని రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీకి ఎంఐఎం ఎందుకు మద్దతు ఇస్తుందో చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పాతబస్తీలో మెట్రో రైలు పనులు ఎందుకు ఆపారో చెప్పాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 

ప్రధాని నరేంద్రమోదీ అనిల్ అంబానీకి చౌకీ దారుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు సేవకుడిగా ఉంటానన్న మోదీ ఇప్పుడు రిలయన్స్ కు సేవకుడిగా పనిచేస్తున్నారని రాహుల్ దుయ్యబుట్టారు. రాఫెల్ ఒప్పందంలో 30వేల కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉందని రాహుల్ ఆరోపించారు. రాఫెల్ కాంట్రాక్ట్ అనిల్ అంబానీ కంపెనీకి వచ్చేలా మోదీ చేశారని విమర్శించారు.   

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణలో రైతులకు రూ.2 లక్షల పంట రుణ మాఫీ: రాహుల్

బైంసాకు చేరుకున్న రాహుల్ గాంధీ...

తెలంగాణలో రాహుల్ పర్యటన ఇలా సాగనుంది...

రాజీవ్ గాంధీ సద్భావన యాత్రను ప్రారంభించిన రాహుల్

Follow Us:
Download App:
  • android
  • ios