తెలంగాణలోని సర్కారు ఆస్పత్రులు వైద్యానికి ఎలాగు పనికి రావని పెద్దలు గ్రహించినట్లు ఉన్నారు. అందుకే వాటిని సినిమా షూటింగ్ లకు  అద్దెకిస్తున్నారు. ఇదీ ఓ విధంగా ప్రభుత్వానికి లాభదాయకమే... 

తెలంగాణ సర్కారు ఆస్పత్రుల గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. రోజు పేపర్ చూస్తే చాలు. బాలింతల మరణాలు, డాక్టర్ల నిర్లక్ష్యాలు, పసికందు అపహరణలు, లంచావతారాలు... ఇలా రోజుకో భిన్నమైన వార్తతో మన దవాఖానలు వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటాయి.

అయితే, ప్రభుత్వాలు మారినా... స్వయంపాలన వచ్చినా సర్కారు వైద్యం తీరు మాత్రం మారడం లేదు.

కుతుబ్ షాహీల యునానీ వైద్యం నుంచి నేటి అల్లోపతి ట్రీట్ మెంట్ వరకు అన్ని రకాల ఆస్పత్రులు అందునా ప్రభుత్వం ఆధీనంలో ఉన్న వైద్యాశాలలు హైదరాబాద్ లోనే చాలా ఉన్నాయి. అయితే అన్నింటా ఇదే పరిస్థితి. పేదోడి జబ్బులు నయం చేయడానికంటే వారి నుంచి డబ్బులు లాక్కోనే సంస్కృతే ఈ ఆస్పత్రుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

రాష్ట్రంలో ఇటీవల సెలైన్ మరణాలు, బాలింతల మృతిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో సర్కారుపై విరుచుకపడ్డాయి. అయినా పరిస్థితి మారడం లేదు సరికదా ఇంకా కొత్త పోకడలకు అధికారులు పోతున్నారు. అందుకు ఈ తాజా సంఘటన ఉదహరణ.

కేంద్ర ప్రభుత్వ సాయంతో చాలా ఏళ్ల కిందటే బీబీ నగర్ లో నిమ్స్ పురుడుపోసుకుంది. అయితే ఇప్పటి వరకు అందులో వైద్య సేవలు అందుబాటులోకి రాలేదు. కనీసం ప్రారంభోత్సవానికి కూడా నోచుకోలేదు. దీనికి కారణాలేంటో ఇప్పటి వరకు ఏ అధికారి చెప్పలేదు.

మూడేళ్లు కావొస్తున్నా తెలంగాణ సర్కారు ఈ విషయంపై దృష్టి కూడా పెట్టడం లేదు. అయితే ఇన్నాళ్లు ఖాళీగా ఉన్న ఆ స్థలంలో ఇప్పుడు సినిమా షూటింగ్ లు మొదలయ్యాయి.

మహేష్ బాబు కొత్త చిత్రం స్పైడర్ లోని కొన్ని సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించేందుకు యూనిట్ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

అయితే స్థానికులు ఈ షూటింగ్ ఆపాలని హెచ్చరించారు. దీంతో చిత్ర యూనిట్ వెంటనే ప్యాకప్ చెప్పింది. గతంలో కూడా పలు షూటింగ్ లు ఇక్కడ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

పేద రోగాలకు ఉచిత వైద్యం కోసం ఏర్పాటు చేసిన నిమ్స్ ను సినిమా షూటింగ్ లకు అద్దెకివ్వడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయం తెలిసి నిమ్స్ అధికారులు షూటింగ్ పర్మిషన్ ను కేన్సల్ చేసినట్లు తెలిసింది.