దారుణం.. నిండు గర్భిణి అయిన కోడలిపై పెట్రోల్ పోసి, నిప్పంటించిన అత్త... !
కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకోవడం తల్లికి నచ్చలేదు. కొడుకును వలలో వేసుకుందని కోడలి మీద పగపెంచుకుంది. అంతే.. నిండు గర్బిణీ అని కూడా చూడకుండా పెట్రోల్ పోసి, నిప్పంటించింది.
హైదరాబాద్ : అత్త కోడళ్ల గొడవలు.. కోడలిని కిరోసిన్ పోసి చంపడం, లేదా ఉరివేసి చంపడం.. చిత్రహింసలకు గురి చేయడం.. ఇటీవలి కాలంలో కాస్త తగ్గినట్టే కనిపించాయి. కానీ అక్కడక్కడ ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తన కుమారుడు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని పగ పట్టింది. కోడల్ని చిత్రహింసలకు గురి చేసి..నిండు గర్భిణి అని కూడా చూడకుండా చివరికి పెట్రోల్ పోసి కాల్చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కోడలు మృత్యువుతో పోరాడుతుండగా, ఆమె కడుపులో ఉన్న మగ కవలలు చనిపోయారు.
తన కుమారుడి ప్రేమ పెళ్లిని జీర్ణించుకోలేని ఓ తల్లి నిండు గర్భిణి అయిన కోడలిపై పెట్రోల్ పోసి, నిప్పంటించి కడుపులోని మగపిల్లల మరణానికి కారణం అయింది. ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కంగ్డి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన బొడ్డు శంకర్ కుటుంబం రెండు సంవత్సరాల క్రితం అచ్చంపేటకు వలస వచ్చారు. అక్కడే స్థిరపడ్డారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. అదే గ్రామానికి చెందిన కురటి పండరి, బొడ్డు శంకర్ పెద్దకుమార్తె కీర్తనలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు.
కూతురి వివాహాన్ని కీర్తన కుటుంబసభ్యులు ఆమోదించినా...ఈ వివాహం పండరి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. వివాహం చేసుకుని ఇంటికి వచ్చినప్పటి నుంచి అత్త అంబవ్వ కోడలితో తరచూ గొడవ పడుతూ ఉండేది. సూటి పోటి మాటలతో వేధించేది. కొడుకుకు విషయం తెలియకుండా చూసుకునేది. చివరికి కొడుకుకు, కీర్తన కుటుంబసభ్యులకు అత్త వేధింపుల విషయం తెలియడంతో..ఈ నేపథ్యంలో పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయి. ఆ పంచాయితీల్లో ఎన్నిసార్లు నచ్చచెప్పినా.. అత్త తీరు మారేది కాదు. కోడలి మీద అదే విధంగా విరుచుకుపడుతుండేది. దీంతో పంచాయితీ పెద్దలు.. అత్తా కోడళ్లను విడివిడిగా ఉండేలా తీర్పు నిచ్చారు.
హైదరాబాద్లో యూట్యూబర్ డీనా ఆత్మహత్య.. వ్యుస్ రాకపోవడంతోనే..!
ఈ మేరకు పంచాయితీలో పెద్దల సూచనల మేరకు కీర్తన, పండరిలను పని కోసం హైదరాబాద్కు పంపించారు. అయితే, అలా వెళ్ళిన కొడుకు, కోడలు పొలం పనుల కోసం వారం రోజుల క్రితం పండరి, కీర్తనలు అచ్చంపేట కు వచ్చారు. సోమవారం కొడుకుని పొలానికి పంపిన అంబవ్వ ఇంట్లో ఉన్న కోడలు కీర్తనపై తన దాష్టీకం మొదలు పెట్టింది. ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పంటించింది.
అనుకోని ఈ హఠాత్పరిణామానికి షాకైన కోడలు తేరుకునే సరికి మంటలు ఆమెకు పూర్తిగా వ్యాపించాయి. మంటలకు తాళలేక..ఆమె వేసిన కేకలు విన్న ఇరుగు పొరుగు వారు వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బాధితురాలిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె అధిక భాగం కాలడంతో కడుపులో ఉన్న మగ కవలలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అత్త మీద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు. తల్లి జైల్లో, భార్య మృత్యువుతో పోరాడుతుండడంతో ఆ కొడుకు బాధ వర్ణనాతీతంగా ఉంది.