హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన మర్డర్ సినిమాపై ప్రణయ్ భార్య అమృత వర్షిణి చేసినట్లు ప్రకటన విషయంలో ప్రణయ్ తండ్రి బాలస్వామి ట్విస్ట్ ఇచ్చారు. ఆర్జీవీ మర్డర్ సినిమాపై అమృత వ్యాఖ్యల పేర పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాల గురించి అమృత మామ బాలస్వామి స్పందించారు. 

అమృత వర్షిణి ప్రకటన చేసినట్లు వచ్చిన వార్తల్లో ఏ విధమైన వాస్తవం లేదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు మర్డర్ సినిమాపై అమృత వర్షిణి ఏ విధంగా కూడా స్పందించలేదని ఆయన స్పష్టంం చేశారు. ఆమె పేరు మీద వస్తున్న ప్రకటనలను విశ్వసించకూడదని ఆయన చెప్పారు. 

Also Read: ఆత్మహత్య చేసుకోవాలనిపించింది... వర్మ సినిమాపై అమృత కామెంట్స్

నిజ జీవితంలో ఓ జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని రూపొందనున్న మర్డర్ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తారు. రామ్ గోపాల్ వర్మ చిత్రంగా అది నిర్మితమవుతోంది నట్టి రుణ, నట్టి క్రాంతి సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

ఆదివారం ఫాదర్స్ డే సందర్బంగా మర్డర్ సినిమా ఫస్ట్ లుక్ ను ఆర్జీవి తన ట్విట్టర్ వేదికంగా విడుదల చేశారు.  మర్డర్ సినిమాపై అమృత వర్షిణి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అమృత వర్షిణి ప్రకటన పేరు మీద వచ్చిన వార్తలపై రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. 

Also Read: మర్డర్‌: అమృత కామెంట్స్‌పై స్పందించిన ఆర్జీవీ

ఆ సినిమా పోస్టర్ ను చూసిన వెంటనే తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని అమృత వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే తన జీవితం తలకిందులైందని, ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్ ను పోగొట్టుకున్నానని, కన్నతండ్రికి కూడా దూరమయ్యాయని అన్నట్లు వార్తలు వచ్చాయి.

ఆ నోట్ పై రామ్ గోపాల్ వర్మ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ నోట్ అమృత రాసిందా, లేక పనిలేక ఇంకెవరైనా రాశారా అనే అనుమానం ఉందని ఆయన చెప్పారు.