Asianet News TeluguAsianet News Telugu

స్వేచ్ఛ హరిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు: కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు


ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  అనుముల రేవంత్ రెడ్డి  కలెక్టర్లు, ఎస్పీలతో  తొలి సారిగా సమావేశమయ్యారు.  

Praja Palana to be start December 28:Telangana Chief Minister Revanth Reddy lns
Author
First Published Dec 24, 2023, 1:20 PM IST

హైదరాబాద్:ఈ నెల  28వ తేదీ నుండి జనవరి  6వ తేదీ వరక  ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  ఆదేశించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆదివారం నాడు  తెలంగాణ సచివాలయంలో  జిల్లాల కలెక్టర్లు,  ఎస్పీలతో  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.  తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా  రేవంత్ రెడ్డి  కలెక్టర్లు, ఎస్పీలతో  ప్రమాణ స్వీకారం చేశారు. 

అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు  ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించనున్నట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు. 

ప్రజా ప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలని సీఎం సూచించారు.  సమన్వయం లేకుంటే అనుకున్న లక్ష్యం దిశగా వెళ్లలేమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది అధికారులేనని సీఎం తేల్చి చెప్పారు.గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్దిదారులను గుర్తించాలని రేవంత్ రెడ్డి సూచించారు.అభివృద్ది అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదన్నారు.పేదలందరికీ సంక్షేమం అందితేనే అభివృద్దని సీఎం రేవంత్ రెడ్డి  చెప్పారు.

ప్రజా సమస్యలను మానవీయ కోణంలో చూడాలని సీఎం సూచించారు.అధికారులు ప్రజల మనసులను గెలుచుకోవాలని సీఎం కోరారు.స్వేచ్ఛను హరిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎంతటివారినైనా ఇంటికి పంపే చైతన్యం తెలంగాణ ప్రజల్లో ఉందన్నారు.ప్రజలతో గౌరవం ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో ఉండాలని సీఎం కోరారు. 

గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతో పాటు తమ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే 'ప్రజాపాలన' కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి.

also read:తప్పిన ప్రమాదం: లిఫ్ట్‌లో చిక్కుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత

అసెంబ్లీ ఎన్నికల్లో  ఆరు గ్యారంటీలతో పాటు పలు హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే  రెండు హామీలను  కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది.  పార్లమెంట్  ఎన్నికల నాటికి  ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం  భావిస్తుంది.  2024  జనవరి చివరి వారంలో   పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్ వెలువడే నాటికి  ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం  తలపెట్టింది. 

also read:పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..

ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని  తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  ప్రకటించారు.  ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. దీంతో  ఇదే రోజున మరికొన్ని హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.  


 

Follow Us:
Download App:
  • android
  • ios