పేద కుటుంబం ఇంటి జాగా కబ్జా కబ్జాకు సహకరించిన సబ్ ఇన్స్పెక్టర్ రెవెన్యూ అధికారిణి కూడా ఐదేళ్లుగా పోరాడుతున్న కుటుంబం

వాళ్లు కటిక పేదవారు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు వారివి. తిని తినక... రెక్కలు ముక్కలు చేసుకుని వంద గజాల జాగా కొనుక్కున్నారు. కానీ ఆ స్థలంపై రాబంధుల కన్ను పడింది. ఇంకేముంది వాలిపోయాయి రాబంధులు. ఆ వంద గజాల జాగా కబ్జా చేశాయి. బాధితులు ఆ స్థలం కోసం గత మూడేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు.

బాధిత దంపతులు జగదాంబ, కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి వద్ద సిద్ధిఖ్ నగర్ లో 1994లో సినీ ఇండస్ట్రీలో లైట్ మెన్ గా పనిచేసే సాయిలు అనే వ్యక్తి వంద గజాల భూమి కొనుగోలు చేశాడు. ఆయనకు ఆ భూమి అమ్మిన వారు అనీల్ కుమార్ ఆర్. కామ్దార్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశాడు. వెయ్యి రూపాయలకు ఈ భూమి విక్రయం జరిగిపోయింది.

తర్వాత ఆ భూమిని 2000 సంవత్సరంలో సాయిలు వద్ద కుమారస్వామి అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ద్వారా జగదాంబ దంపతులు కొనుగోలు చేశారు. అందుకోసం 60 వేల రూపాయలు చెల్లించారు. 50 రూపాయల బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకున్నారు. మూడు దఫాలుగా ఈ మొత్తాన్ని సాయిలుకు చెల్లించారు.

జగదాంబ భర్త కుమార్ బట్టల షాపులో పనిచేస్తాడు. జగదాంబ ఇండ్లల్లో పనిచేస్తున్నది. వారికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. వారు చదువుకుంటున్నారు. ప్రస్తుతం వారు లాల్ దర్వాజ లో నివాసముంటున్నారు. తాము కొనుగోలు చేసిన వంద గజాల భూమి చుట్టూ కంపౌండ్ గోడ నిర్మించి గేటు కూడా పెట్టుకున్నారు. అప్పుడప్పుడు ఆ జాగా వద్దకు వెళ్లి వస్తూ ఉన్నారు.

అనూహ్యంగా 2012 ఏప్రిల్ లో వాళ్ల జాగాను స్థానికంగా పరపతి ఉన్న కొందరు వ్యక్తులు కబ్జా చేశారు. అక్కడ మూడు గదులు నిర్మించి వాటిని కిరాయికి ఇచ్చేశారు. తెలివిగా ఆ ఇంటికి రాజు గౌడ్ అనే వ్యక్తి ఓనర్ అని పేర్కొంటూ కరెంటు మీటర్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ కరెంటు మీటర్ కూడా రాజు గౌడ్ పేరుతో వచ్చింది. ఈ కబ్జా పర్వంలో మధ్యవర్తిగా ఉన్న కుమార స్వామి, ఆయన భార్య హరిణి (ఈమె అప్పట్లో డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నారు) కూడా పాత్రదారులుగా ఉన్నట్లు జగదాంబ దంపతులు చెబుతున్నారు.

తమ భూమి కబ్జాకు గురైందని గుర్తించిన జగదాంబ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ సమయంలో నరేష్ అనే ఎస్సై కబ్జా దారులకు మద్దతు ఇచ్చినట్లు చెబుతున్నారు. వీరితోపాటు ఈ భూ కబ్జా వ్యవహారంలో రాజుగౌడ్ సోదరుడు యాదగిరి గౌడ్ ప్రధాన నిందితుడు అని చెబుతున్నారు. వీరితోపాటు గోపాల్ గౌడ్, విక్రం చారి ఉన్నారు. అలాగే మల్లేపల్లి రౌడీషీటర్ అహ్మద్ కూడా పాత్రదారుడే అని చెప్పారు బాధితులు.

  • బాధిత కుటుంబం చెబుతున్న మేరకు నిందితులు వీరే.... (వీరితోపాటు మరికొందరు కూడా ఈ గ్యాంగులో ఉన్నట్లు సమాచారం)

​ఇటీవల తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన సాదా బైనామాల కింద తమ స్థలాన్ని రిజిస్టర్ చేయించుకునే ప్రయత్నం చేశారు జగదాంబ. కానీ కబ్జాలో ఈ గ్యాంగ్ ఉండడంతో రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయారు. ఈ విషయంలో జగదాంబ కుటుంబసభ్యులు సైబరాబాద్ పోలీసు కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేశారు. అప్పట్లో కమిషనర్ గా ఉన్న సివి ఆనంద్ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించే ప్రయత్నం చేశారు. కానీ కిందిస్థాయిలో విచారణ ఆశించిన మేరకు జరగలేదు. దీంతో కేసు పెండింగ్ లో పడింది.

తర్వాత పలుమార్లు పోలీసుల వద్దకు వెళ్లినా... నిందితులను కూడా తీసుకురండి అని పోలీసులు చెబుతున్నారు. వారిని తీసుకొచ్చిన తర్వాత వారి సమక్షంలో పోలీసులు విచారణ జరిపారు. సిద్ధిఖ్ నగర్ లోని తమ జాగా పరిసర ప్రాంతంలో ఉన్నవారిని విచారించారు పోలీసులు. అక్కడి వారంతా ఆ స్థలం జగదాంబదే అని అక్కడి వారు పోలీసులకు చెప్పారు. కానీ ఇవతల పక్క పలుకుబడి ఉన్నవారు కావడంతో ఆ భూమి కేసును పోలీసులు చేధించలేకపోతున్నారు.

తమ భూమిని ఆక్రమించిన ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని తమ భూమి తమకు ఇప్పించాలని వారు వేడుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ విలువ 30 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. తమ కూతురు పెళ్లి సమయంలో ఇచ్చేందుకు ఆ స్థలాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మకుండా అట్టి పెట్టుకున్నామని జగదాంబ అంటున్నారు. ఆ భూమి తమదే కాకపోతే అంత పలుకుబడి ఉన్నోళ్లతోటి మేము ఘర్షణ పెట్టుకుని నెగుల్తమా అని వారు అంటున్నారు. మా భూమి కాబట్టే మేము మా శక్తి మేరకు కొట్లాడుతున్నమని అంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు సీరియస్ గా తీసుకుని తమ భూమిని తమకు ఇప్పించాలని కోరుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసు సార్లూ ఈ పేద కుటుంబానికి న్యాయం చేయండి, సాయం చేయండి జర.

(బాధితులకు సాయం చేయాలనుకునే వారెవరైనా సంప్రదించాల్సిన నెం. 9393536155... జగదాంబ)