కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చేదు అనుభవం: సికింద్రాబాద్ రూబీ లాడ్జీ వద్ద అడ్డుకున్న పోలీసులు
సికింద్రాబాద్ రూబీ లాడ్జీలో ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంగళవారం నాడు చోటు చేసుకుంది. భవనానికి పోలీసులు తాళం వేశారు. ఈ విషయమై పోలీసులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ రూబీ లాడ్జీలో చోటు చేసుకున్న ప్రమాద వివరాలను తెలుసుకొనేందుకు వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఈ భవనాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో భవనానికి పోలీసులు లాక్ చేశారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించేందుకు వెళ్లేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం నాడు అక్కడికి చేరుకున్నారు. అయితే భవనానికి తాళం వేసి ఉన్నందున పోలీసులు అనుమతించేందుకు నిరాకరించారు. దీంతో పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు లేదా ప్రగతి భవన్ కు ఫోన్ చేయండని పోలీసు అధికారి తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.. అనంతరం కిషన్ రెడ్డిని పోలీసులు భవనంలోకి అనుమతించారు. భవనాన్ని పరిశీలించిన తర్వాత ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
సికింద్రాబాద్ రూబీ లాడ్జీలో జరిగిన అగ్ని ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ప్రమాదం జరిగితే ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతం తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.ఈ ప్రదేశాన్ని తాను పరిశీలించడానికి ఉన్నతాధికారుల అనుమతిని పోలీసులు తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
also read:సికింద్రాబాద్ రూబీ లాడ్జీ భవనంలో రెండు లోపాలు: అగ్నిమాపక రీజినల్ అధికారి పాపయ్య
ఎలక్ట్రిక్ బైక్ ల కారణంగానే ప్రమాదం జరిగితే ఈ సంస్థ ద్వారా మృతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగితే దానిపై కూడా ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ, విద్యుత్, ఫైర్ సేఫ్టీ అధికారులు క్రమం తప్పకుండా పెద్ద పెద్ద భవనాల్లో తనిఖీలు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.