తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బండి సంజయ్‌ను కరీంనగర్‌లోని ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకుని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీసు ష్టేషన్‌కు తరలించారు. బండి సంజయ్‌పై పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఆయనపై పోలీసులు కుట్ర కేసు నమోదు చేసినట్టుగా సమాచారం. వరంగల్‌లో పదో తరగతి పరీక్షా ప్రశ్నపత్రం లీక్‌కు సంబంధించి ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా బండి సంజయ్‌ను బొమ్మలరామారం పోలీసు స్టేషన్‌ నుంచి తరలించారు. బండి సంజయ్‌ను తరలిస్తున్న సమయంలో బీజేపీ శ్రేణులు అడ్డుపడగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు.

బండి సంజయ్‌ను తరలించే మార్గంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఆయనను ఎక్కడకు తీసుకెళ్తున్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆయనను వరంగల్‌కు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. 

Also Read: మా అమ్మ చిన్న కర్మకు హాజరయ్యేందుకు ఇంటికి వచ్చారు.. ట్యాబ్లెట్స్ కూడా వేసుకోనివ్వలేదు: బండి సంజయ్ భార్య

ఇక, కరీంనగర్‌లోని బండి సంజయ్ నివాసం నుంచి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంది. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను.. తనను తీసుకెళ్లడానికి గల కారణమేమిటో చెప్పాలని ప్రశ్నించారు. తన మీద ఏం కేసు ఉందని?, వారెంట్ లేకుండా ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. అయితే పోలీసులు కారణం చెప్పకుండానే బండి సంజయ్‌ను ఆయన ఇంటి నుంచి బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఈ సమయంలో బీజేపీ శ్రేణులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. అయితే ఈ ఉద్రిక్తతల మధ్యే బండి సంజయ్‌ను పోలీసు వాహనంలోకి ఎక్కించిన పోలీసులు.. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న పలువురు బీజేపీ నాయకులు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు బొమ్మలరామారం పోలీసు ష్టేషన్‌కు చేరుకుంటున్నారు. బండి సంజయ్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. 

Also Read: బొమ్మలరామారం పీఎస్‌లో బండి సంజయ్.. లోనికి వెళ్లేందుకు యత్నించిన బీజేపీ శ్రేణులు.. తీవ్ర ఉద్రిక్తత..

అయితే ఈ క్రమంలోనే కొందరు బీజేపీ శ్రేణులు పోలీసు స్టేషన్‌లోని చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్ని అక్కడి నుంచి వాహనాల్లో తరలిస్తున్నారు. 

మరో వైపు బండి సంజయ్‌ను పరామర్శించేందుకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు బొమ్మలరామారం పోలీసు ష్టేషన్‌కు చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడమేమిటని ప్రశ్నించారు. బండి సంజయ్‌ అరెస్ట్‌కు గల కారణాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, రఘునందన్ రావుకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.