తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన బండి సంజయ్‌ సతీమణి అపర్ణ.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన బండి సంజయ్‌ సతీమణి అపర్ణ.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రోజుల క్రితం మరణించిన తన తల్లి చిన్న కర్మలో పాల్గొనేందుకు బండి సంజయ్ ఇంటికి వచ్చారని చెప్పారు. తన తల్లి చిన్న కర్మలో సంజయ్ పాల్గొనకుండా చేశారన్నారు. బండి సంజయ్ ప్రజా ప్రతినిధి అని.. అలా బలవంతంగా ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. సంజయ్‌ను కనీసం టాబ్లెట్స్ కూడా వేసుకొనివ్వలేదని చెప్పారు. సంజయ్‌కు నోటికి దెబ్బతాకి రక్తం వస్తుందని చెప్పిన కూడా నీళ్లు ఇవ్వనివ్వలేదని అన్నారు.

బండి సంజయ్ రాత్రి 11.30 గంటల సమయంలో ఇంటికి వచ్చారు. కాళ్లు, చేతులు కడుక్కోని భోజనం చేస్తున్న సమయంలో పోలీసులు వచ్చారు. ఏసీపీ రావడంతో వారిని ముందు రూమ్‌లో కూర్చొమని చెప్పడం జరిగింది. సంజయ్ భోజనం చేసి వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. నేను ట్యాబ్లెట్స్ తీసుకురావడానికి మరో గదిలోకి వెళ్లాను. అయితే పోలీసులు అరెస్ట్ చేయనున్నట్టుగా చెప్పడంతో.. అరెస్ట్ వారెంట్ ఉందా? అని సంజయ్ ప్రశ్నించారు. అందుకు పోలీసులు సరైన కారణం చెప్పలేదు. కమిషనర్ చెప్పారని అని అనడంతో.. సంజయ్ ఆయనకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించారు.

Also Read: బొమ్మలరామారం పీఎస్‌లో బండి సంజయ్.. లోనికి వెళ్లేందుకు యత్నించిన బీజేపీ శ్రేణులు.. తీవ్ర ఉద్రిక్తత..

అయితే ఈలోపే 40 మంది పోలీసులు లోనికి వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. పిల్లలు వచ్చి ఆపేందుకు యత్నించగా.. వారిని లాగిపడేశారు. అడ్డుకునేందు యత్నించినవారిని కాళ్లతో తన్నారు. అసలు దేని గురించి తీసుకెళుతున్నారనే దానిపై కూడా సమాచారం ఇవ్వలేదు. సంజయ్‌కు నోటికి దెబ్బతాకిందని చెప్పినప్పటికీ వాటర్ ఇవ్వనివ్వలేదు. దుఃఖంలో ఉన్న కుటుంబానికి ఇలా చేయడం న్యాయమా?’’ అని అపర్ణ ప్రశ్నించారు. 

ఇక, కరీంనగర్‌లోని బండి సంజయ్ నివాసం నుంచి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంది. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను.. తనను తీసుకెళ్లడానికి గల కారణమేమిటో చెప్పాలని ప్రశ్నించారు. తన మీద ఏం కేసు ఉందని?, వారెంట్ లేకుండా ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. అయితే పోలీసులు కారణం చెప్పకుండానే బండి సంజయ్‌ను ఆయన ఇంటి నుంచి బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఈ సమయంలో బీజేపీ శ్రేణులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. అయితే ఈ ఉద్రిక్తతల మధ్యే బండి సంజయ్‌ను పోలీసు వాహనంలోకి ఎక్కించిన పోలీసులు.. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే బండి సంజయ్‌‌ను ఎందుకు అరెస్ట్ చేశారనే దానిపై పోలీసులు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.