తెలంగాణ పోలీసులు లాక్‌డౌన్ విషయంలో కఠినంగా వుంటున్నారు. విద్యుత్ కార్మికులు, మీడియా సిబ్బందిపైనా ప్రతాపం చూపిన ఖాకీలు ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా 5 నిమిషాలు ఆలస్యం కావడంతో లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన కింద ఓ యువకుడికి పోలీసులు వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. దీంతో ఆ యువకుడు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాడు. 

వివరాల్లోకి భువనగిరిలో ఉదయం 10 గంటల తర్వాత పట్టణంలోని వినాయక చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆర్బీనగర్‌కు చెందిన నరేశ్‌ హైదరాబాద్‌ నుంచి భువనగిరికి వచ్చాడు. ప్రభుత్వం నిర్దేశించిన సమయం దాటి ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన పేరిట రూ.వెయ్యి జరిమానా విధించారు.

Also Read:హెల్మెట్, మాస్క్ లేదు.. పది దాటినా రోడ్ల మీదకి: ప్రశ్నించినందుకు పోలీసులపైనే దాడి

దీంతో ఖంగు తిన్న ఆ యువకుడు ఐదు నిమిషాలు ఆలస్యానికే వెయ్యి రూపాయలు జరిమానా విధించడం ఏంటంటూ వాగ్వాదానికి దిగాడు. అక్కడితో ఆగకుండా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశాడు. ఆ వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పీఎస్‌కు తరలించారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన నేరం కింద రూ.1000 జరిమానాతో పాటు రోడ్డుపై బైఠాయించి న్యూసెన్స్‌ క్రియేట్‌ చేసినందుకు 341, 290 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పోలీసులు తమ విధిని నిర్వర్తించారని కొందరంటుంటే.. ఇంకొందరు మాత్రం ఐదు నిమిషాల ఆలస్యానికే ఇలాంటి శిక్షలు సరికాదని కామెంట్ చేస్తున్నారు.