మహబూబాబాద్: వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గత ఆదివారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్ సరళిని పరిశీలించేందుకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పోలింగ్ బూత్ వద్దకు వెళ్లిన బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగారు. దీంతో బిజెపి-టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణకు సంబంధించి తాజాగా స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సహా 17మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.

ఇక సోమవారమే పలువురు బిజెపి నాయకులను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిపైనా కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 12 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా పోలీసులు తెలిపారు.

read more  ఎమ్మెల్సీ ఎన్నికలు: బీజేపీ అభ్యర్ధి ప్రేమేందర్ రెడ్డిపై దాడి.. మంత్రి ఎర్రబెల్లి స్పందన

ఈ సందర్భంగా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ... ఈ నెల 17వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో వుండనున్న నేపథ్యంలో  మహబూబాబాద్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా 144సెక్షన్ విధించినట్లు తెలిపారు. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తోరోకోలకు అనుమతి లేదని... నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.