హైదరాబాద్‌లో ఎస్సార్ నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న రూ. 7 కోట్ల  విలువై బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు చేధించారు. చోరీకి పాల్పడిన డ్రైవర్ శ్రీనివాస్‌ను ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లాలో అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో ఎస్సార్ నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న రూ. 7 కోట్ల విలువై బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు చేధించారు. చోరీకి పాల్పడిన డ్రైవర్ శ్రీనివాస్‌ను ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లాలో అరెస్ట్ చేశారు. అడవిలో పాతిపెట్టిన నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు. నిందితుడు శ్రీనివాస్‌ను పట్టుకునేందుకు ఆరు బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 

అసలేం జరిగిందంటే.. మాదాపూర్‌లోని మైహోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న రాధిక నగల వ్యాపారం చేస్తున్నారు. వజ్రాభరణాలు అవసరమైన వారికి కొనుగోలు చేసి సరఫరా చేస్తుంటారు. రాధిక వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారం క్రితం ఓ కస్టమర్‌ వద్దకు కొన్ని ఆభరణాలు ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో.. సేల్స్‌మెన్‌ కారు దిగగానే డ్రైవర్‌ శ్రీనివాస్‌ కారుతో ఉడాయించాడు. 

ఈ విషయాన్ని సేల్స్‌మెన్ వెంటనే రాధికకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో రాధిక వెంటనే ఎస్సార్ నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ కారులో రూ. 7 కోట్ల విలువజేసే ఆభరణాలు ఉన్నాయని.. వాటిని పంజాగుట్టలోని ఓ నగల దుకాణంలో ఇవ్వాల్సి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు డ్రైవర్‌ కోసం గాలింపు చేపట్టారు.