ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన తెలంగాణలో పర్యటిస్తున్నారు. వరంగల్ పర్యటించనున్న ప్రధాని కాజీపేట్ వ్యాగన్ ఓవర్‌హాలింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. వారణాసి నుంచి ఉదయం బయల్దేరి హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌కు చేరుకుంటారు.
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన తెలంగాణకు రానున్నారు. జులై 8వ తేదీన ఆయన వరంగల్‌కు రాబోతున్నట్టు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ నెల 8వ తేదీన ప్రధాని మోడీ యూపీలోని ఆధ్యాత్మిక నగరం వారణాసి నుంచి హైదరాబాద్‌కు వస్తారు. 8వ తేదీన ఉదయం 9.45 గంటలకు ఆయన వారణాసి నుంచి హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10.35 గంటల కల్లా వరంగల్‌లో దిగుతారు. అనంతరం, ఉదయం 10.45 గంటల నుంచి 11.20 గంటల వరకు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు.
ఈ అభివృద్ధి కార్యక్రమాల తర్వాత వరంగల్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.10 గంటల వరకు బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత మధ్యాహ్నం 12.20 గంటలకు వరంగల్ నుంచి తిరిగి హకీంపేట్‌కు వెళ్లుతారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతారు. వరంగల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ కాజీపేట వ్యాగన్ ఓవర్‌హాలింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు చోటుచేసుకున్న తరుణంలో ప్రధాని మోడీ తెలంగాణ పర్యటించనున్నారు. తెలంగాణ బీజేపీ నాయకత్వంలో మార్పులు ఉంటాయని సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వరంగల్ బహిరంగ సభకు తాను బీజేపీ అధ్యక్షుడిగా హాజరవుతానో లేదో అనే సందేహాన్ని సంజయ్ తన సన్నిహితుల వద్ద వెలుబుచ్చినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: లోక్ సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్?.. మహారాష్ట్ర సీఎంగా అజిత్ పవార్ ముందస్తు డీల్!.. షిండే వర్గంలో భయాలు
వరంగల్‌లో ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు ముందే తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎవరనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. ఇదే నెల 8వ తేదీన జేపీ నడ్డా అధ్యక్షతన హైదరాబాద్‌లో 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించాలని అనుకున్నారు. కానీ, ఆ తర్వాత ఈ సమావేశం వాయిదా పడింది.
