లోక్ సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్?.. మహారాష్ట్ర సీఎంగా అజిత్ పవార్ ముందస్తు డీల్!.. షిండే వర్గంలో భయాలు
మహారాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. లోక్ సభ ఎన్నికలు లక్ష్యంగా బీజేపీ పవర్ గేమ్ ఆడుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర సీఎంగా అజిత్ పవార్ త్వరలోనే బాధ్యతలు తీసుకుంటారని, ఈ మేరకు బీజేపీతో ఆయన ముందస్తుగానే డీల్ చేసుకున్నారని తెలుస్తున్నది. ఏక్‌నాథ్ షిండే త్వరలోనే దిగిపోతారనే వార్తలు వస్తున్న తరుణంలో ఆ వర్గంలోనూ భయాలు నెలకొంటున్నాయి.
ముంబయి: మహారాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. శివసేనపై తిరుగుబాటు చేసి షిండే బీజేపీతో చేతులు కలిపినట్టే శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీపై తిరగుబాటు చేసి అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరారు. ఆయన ఏకంగా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయగా.. ఆయన వెంట వచ్చిన వారు గౌరవ మంత్రులుగా ప్రమాణం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరింత బలం చేకూరుతుందనే అభిప్రాయం కాకుండా ఏక్‌నాథ్ షిండే వర్గంలో భయాలు నెలకొంటున్నాయి. ఇందుకు ప్రధాన కారణం త్వరలోనే అజిత్ పవార్.. సీఎంగా షిండే స్థానాన్ని ఆక్రమిస్తారనే చర్చ జరగడమే.
శరద్ పవార్ నేటి కాలపు రాజనీతిజ్ఞుడని అంటారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ఆయనకు అన్ని పార్టీల నుంచి సముచిత గౌరవం లభిస్తుంది. ప్రతి అంశంపై తనదైన రీతిలో వ్యవహరిస్తారని పేరున్నది. అలాంటిది.. శరద్ పవార్‌కు అత్యంత సన్నిహతులూ.. ఇటీవలే ఆయన నమ్మి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన ప్రఫుల్ పటేల్ కూడా తిరుగుబాటు చేయడంపై కొన్ని అనుమానాలూ వస్తున్నాయి. శరద్ పవార్‌కు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా? అనే సంశయాలు ఒక వైపు వస్తున్నాయి.
ఈ వాదనలు పక్కనపెడితే.. అజిత్ పవార్ ముందస్తు డీల్‌తోనే ప్రభుత్వంతో చేతులు కలిపారనేది ఇప్పుడు ఇతర విపక్ష పార్టీలు, రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. శివసేన ఉద్దవ్ ఠాక్రే మౌత్ పీస్ సామ్నా పత్రిక సంపాదకీయంలో ఈ ఆరోపణలను ప్రధానంగా చేసుకుంది. ఏక్‌నాథ్ షిండే, ఆయన వర్గంపై త్వరలోనే అనర్హత వేటు పడుతుందని, అందుకోసమే బీజేపీ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్సీపీని చీల్చి వెంట తెచ్చుకుందని ఆరోపించింది. త్వరలోనే ఎక్‌నాథ్ షిండే సీఎంగా దిగిపోతారని, ఆ స్థానాన్ని అజిత్ పవార్ అధిరోహిస్తారని పేర్కొంది. ఇవే వ్యాఖ్యలను నిన్న శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఎంపీ సంజయ్ రౌత్ చేశారు.
Also Read: షిండేపై వేటు పడుతుంది.. నెక్స్ట్ సీఎం అజిత్ పవార్: సంజయ్ రౌత్ సంచలనం
కాంగ్రెస్ సీనియర్ లీడర్, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ కూడా ఇదే చెప్పారు. తనకు అందిన సమాచారం ప్రకారం, అజిత్ పవార్ ముందస్తుగానే బీజేపీతో డీల్ కుదుర్చుకున్నారని పేర్కొన్నారు. పక్కాగా హామీ తీసుకునే ఆయన శరద్ పవార్ పై తిరుగుబాటు చేసి చేతులు కలిపారని తెలిపారు.
త్వరలోనే షిండే వర్గంపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నదనే వాదనలు ఒకవైపు ఉంటే.. షిండే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నదనే అంచనాలు ఇంకోవైపు ఉన్నాయి. శివసేన పార్టీని చీల్చిన షిండే వర్గంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నదని, శివసేన, బాల్ ఠాక్రే సానుభూతిపరులు, అభిమానులు ఉద్ధవ్ ఠాక్రే వైపు కదులుతున్నారని తెలుస్తున్నది. ఇది వచ్చే సార్వత్రిక ఎన్నికలపై బీజేపీకి ప్రతికూలంగా మారే ముప్పు ఉన్నదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. యూపీ తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలు 48 మహారాష్ట్రలోనే ఉన్నాయి. అందుకే బీజేపీ ఈ గేమ్ ప్లాన్ చేసినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే షిండే ఫ్యాక్షన్ తమ పరిస్థితులు రెంటికి చెడ్డ రేవడిగా మారుతుందా అనే ఆలోచనలో పడ్డాయి. భయాల్లో ఉన్న ఏక్‌నాథ్ షిండే ఎమ్మెల్యేలతో షిండే స్వయంగా సమావేశాలు నిర్వహిస్తూ వారిలో భయాలను తొలగించే పనిలో పడ్డట్టు తెలిసింది.