తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరంగల్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని ఆయన తెలుగులో ప్రారంభించారు. తెలంగాణ చారిత్రక ప్రాశస్త్యాన్ని ప్రస్తావించారు. 

వరంగల్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు తెలంగాణకు వచ్చిన సంగతి తెలిసిందే. వరంగల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప సంభలో ప్రసంగించారు. ఈ సందర్భంలో ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టారు.

భారత్ మాతాకీ జై అంటూ మొదలు పెట్టిన ప్రసంగంలో తెలంగాణ ప్రత్యేకతలను, తెలంగాణ పౌరుషాన్ని ప్రస్తావించారు. వరంగల్‌లో భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన ఆయన.. ఈ సభలో అమ్మవారిని తలుచుకున్నారు.

‘భద్రకాళి మహత్మ్యం, సమ్మక్క- సారలమ్మ పౌరుషం, రాణి రుద్రమ పరాక్రమం’ అంటూ తెలంగాణ చరిత్ర, ప్రాశస్త్యాన్ని పేర్కొన్నారు. అనంతరం, తాను చారిత్రక వరంగల్‌కు రావడం సంతోషంగా ఉన్నదని తెలుగులోనే మాట్లాడటం గమనార్హం. అనంతరం ఆయన తన రాజకీయ ప్రసంగాన్ని కొనసాగించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్‌కు వచ్చి సుమారు రూ. 6 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు తమ అస్తిత్వానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ తెలుగులో మాట్లాడారు.

Also Read: వరంగల్ చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన తెలంగాణ అధికారులు, బీజేపీ నేతలు..

ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు పరస్పరం లోపాయికారి ఒప్పందంతో నడుచుకుంటున్నాయని, అవి రెండూ ఒకటే తాను ముక్కలన్న విమర్శలు వస్తున్న సందర్భంలో ప్రధాని మోడీ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. మోడీ సభను బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ పేర్కొంది.