తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కారణంగా కేంద్ర పథకాలు ఆలస్యం అవుతున్నాయని అన్నారు.
తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కారణంగా కేంద్ర పథకాలు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్‌లో పర్యటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ ప్రారంభించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. అక్కడి నుంచి రిమోట్ ద్వారా హైదరాబాద్‌లోని బీబీనగర్‌లోని ఎయిమ్స్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
ఐదు జాతీయ రహదారుల ప్రాజెక్టులు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. భారత్ మాతాకీ జై అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ‘‘ప్రియమైన సోదర సోదరీమణులారా.. మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారములు.. ’’ అని తెలుగులో మోదీ పేర్కొన్నారు. గొప్ప విప్లవకారుల నేల... తెలంగాణకు వందనమని అన్నారు.
ఈరోజు మళ్లీ తెలంగాణ అభివృద్ధికి మరింత ఊతమిచ్చే భాగ్యం తనకు దక్కిందని పేర్కొన్నారు. ఈ రోజు ఇక్కడ ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విశ్వాసం, ఆధునికత, సాంకేతికత, పర్యాటకాన్ని అనుసంధానం చేయబోతోందని చెప్పారు. ఈ వందేభారత్ రైలు భాగ్యలక్ష్మీ ఆలయం ఉన్న నగరాన్ని.. వెంకటేశ్వరస్వామి ఆలయం ఉన్న నగరంతో కలిపామని చెప్పారు.
తెలంగాణ అభివృద్ధికి సంబంధించి... ఇక్కడి ప్రజల అభివృద్ధికి సంబంధించి కన్న కలను నెరవేర్చడం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కర్తవ్యంగా భావిస్తోందని చెప్పారు. 'సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్' మోడల్‌తో తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. గత 9 ఏళ్లలో హైదరాబాద్‌లో దాదాపు 70 కిలోమీటర్ల మేర మెట్రో నెట్‌వర్క్‌ను నిర్మించామని తెలపారు. హైదరాబాద్ మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (MMTS) ప్రాజెక్ట్‌లో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఎంఎంటీఎస్ త్వరితగతిన విస్తరణ కోసం ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు రూ. 600 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పారు.
తెలంగాణకు ఎయిమ్స్ ఇచ్చే ఘనత కూడా తమ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. తెలంగాణలో రైల్వేలతో పాటు హైవేల నెట్‌వర్క్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిరంతర కృషి వల్ల నేడు తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు రెట్టింపు అయిందని చెప్పారు. 2014లో ఇక్కడ సుమారు 2500 కి.మీ పొడవునా జాతీయ రహదారి ఉండగా.. అది నేడు 5,000 కి.మీలకు పెరిగిందని తెలిపారు. ఈ సమయంలో కూడా హైదరాబాద్ రింగ్ రోడ్డుతో సహా తెలంగాణ అభివృద్ధికి రూ. 60 వేల కోట్లతో రోడ్ల ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో మెగా టైక్స్ట్ టైల్ పార్క్ రాబోతుందని చెప్పారు.
‘‘కేంద్రానికి చెందిన చాలా ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో ప్రతి ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి సంబంధించిన ఏ పనికి ఆటంకం కలిగించవద్దని కోరుతున్నాను. నేటి నవ భారతదేశంలో, దేశప్రజల ఆశలను నెరవేర్చడమే మా ప్రాధాన్యత. అయితే ఈ అభివృద్ధి పనుల పట్ల కొద్దిమంది చాలా ఆందోళన చెందుతున్నారు. కుటుంబ పాలన, బంధుప్రీతి, అవినీతిని పెంచి పోషిస్తున్న ఇలాంటి వ్యక్తులు నిజాయితీగా పనిచేసే వారి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అలాంటి వారికి దేశ ప్రయోజనాలతో, సమాజ శ్రేయస్సుతో సంబంధం ఉండదు. అలాంటి వారు తమ కుటుంబం అభివృద్ధి చెందాలని మాత్రమే ఇష్టపడతారు. ఇలాంటి వారితో తెలంగాణ చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను పెంచాం. లబ్దిదారులకు నేరుగా పథకాలను అందజేస్తున్నాం’’ అని అన్నారు.
కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదని.. కుటుంబ వాదం ఉన్నచోటే అవినీతి పెరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా? వద్దా? అని ప్రశ్నించారు. అవినీతిపరులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలా? వద్దా? అని ప్రశ్నించారు. తనపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయని అన్నారు. కోర్టుకు కూడా వెళ్లారని.. అక్కడ వారికి షాక్ తగిలిందని అన్నారు. తెలంగాణలో పేదలకు ఇచ్చే రేషన్‌ను కూడా కుటుంబ పాలన దోచుకుంటోందని విమర్శించారు. భారతదేశ సమగ్ర ప్రగతికి తెలంగాణ వేగవంతమైన పురోగతి ముఖ్యమని చెప్పారు.
