Asianet News TeluguAsianet News Telugu

ప్రతిపక్షాలను డోంట్ కేర్

విషయం చూస్తుంటే పెద్ద నోట్ల రద్దు విషయంలో తప్పు చేసానని ప్రధానే అనుకుంటున్నట్లే కనబడుతోంది. అందుకే సభకు గైర్హాజరవుతున్నారేమో.

PM feeling guilty

ప్రధానమంత్రి నరేంద్రమోడి రూటే సపరేటన్నట్లుగా ఉంది. విపక్షాలను డోంట్ కేర్ అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. గడచిన తొమ్మిది రోజులుగా దేశాన్నిఅతలాకుతలం చేస్తున్న పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై పార్లమెంట్ లో విపక్షాలకు సమాధానం ఇవ్వటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. చెలామణిలో ఉన్న వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు పెద్ద ఈనెల 8వ తేదీన రాత్రి మోడి ప్రకటించారు. మరుసటి రోజు నుండి దేశమంతా గందరగోళంలో పడిపోయింది. ఒక్కసారిగా పెద్ద నోట్లు రద్దవటం, 100, 50 నోట్లు పెద్దగా చెలామణిలో లేకపోవటంతో దేశవ్యాప్తంగా ప్రజలు సమస్యల్లో కూరుకుపోయారు.

 

  ఎక్కడ చూసిన పెద్ద నోట్లే గానీ చిన్న నోట్లు కనబడలేదు. దానికి తోడు పెద్ద నోట్లు రద్దు మరుసటి రోజు బ్యాంకులకు శెలవుగా ప్రకటించటం, రెండో రోజు కూడా ఏటిఎంలు పనిచేయకపోవటంతో దేశ ప్రజలంతా రోడ్డెక్కారు. అప్పటి నుండి నేటికి తొమ్మిది రోజులైనా సమస్య అంతకంతకు పెరుగుతున్నదే గాని ఏమాత్రం తగ్గటం లేదు. ఈ నేపధ్యంలోనే బుధవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి.

 

దేశాన్ని అతలాకుతలం చేసిన ప్రధాని ప్రకటనను తప్పుపడుతూ ఉభయ సభల్లోనూ చర్చించేందుకు విపక్షాలు ఏకమయ్యాయి. దాంతో ప్రభుత్వం అసలు సభలో చర్చకే అనుమతించటం లేదు. దేశాన్ని పట్టి కుదిపేస్తున్న ఇంతటి సమస్యపై చర్చకు ప్రభుత్వం అనుమతించకపోవటం గమనార్హం. పైగా బుధవారం లోక్ సభ వాయిదా పడగా, రాజ్యసభ మాత్రం జరిగింది. ఎంపి రేణుకా సిన్హా మృతికి నివాళులు అర్పించిన తర్వాత లోక్ సభను వాయిదా వేయటంతో సభ జరగలేదు.

 

   తొలిరోజైన బుధవారం మాత్రం సభకు హాజరైన ప్రధాని ప్రతిపక్ష నేత సోనియాగాంధిని పరామర్శించారు. అయితే రాజ్యసభకు మాత్రం హాజరుకాలేదు. అయితే, గురువారం ఉభయ సభలూ మొదలైనా ఏ సభలోనూ ప్రధానమంత్రి కనబడలేదు. ప్రధాని సభకు హాజరవ్వాలంటూ  విపక్షాలు ఎంత డిమాండ్ చేసినా ఏమాత్రం ఖాతరు చేయకపోవటం గమనార్హం.

 

  పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్ధే కుప్పకూలుతోంది. ఇంతటి కరెన్సీ సంక్షోభానికి కారణమైన తన నిర్ణయాన్ని సమర్ధించుకోవటానికి ప్రధానికి ఇంతకు మించిన వేదిక దొరకదు. అయినా సరే సభకు హాజరై విపక్షాల విమర్శలు, ఆరోపణలకు సమాధానం చెప్పటానికి ఇష్ట పడలేదు. పెద్ద నోట్ల రద్దును సమర్ధించుకుంటూ కంట తడిపెట్టి దేశంలోని వివిధ ప్రాంతాల్లో భావోధ్వేగంగా ప్రసంగాలు చేస్తున్న మోడి పార్లమెంట్ కు ఎందుకు రావటం లేదని విపక్షాలు నిలదీస్తున్నాయి. విషయం చూస్తుంటే పెద్ద నోట్ల రద్దు విషయంలో తప్పు చేసానని ప్రధానే అనుకుంటున్నట్లే కనబడుతోంది. అందుకే సభకు గైర్హాజరవుతున్నారేమో.

Follow Us:
Download App:
  • android
  • ios