లాక్ డౌన్ సమయంలో నిబంధనలను ఉళ్ళంఘిస్తూ రోడ్లపైకి వస్తున్న ఆకతాయిలకు వినూత్న పద్దతిలో శిక్షిస్తున్నారు పెద్దపల్లి పోలీసులు.  

పెద్దపల్లి: కరోనా మహమ్మారి కోరలు చాచింది. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టింది. అయినప్పటికి తమకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు ఆకతాయిలు. లాక్ డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వస్తూ నిబంధనలను ఉళ్ళంగిస్తున్నారు. ఇలాంటి ఆకతాయిలకు బుద్దిచెప్పడానికి పెద్దపల్లి పోలీసులు వినూత్న పద్దతిలో శిక్షిస్తున్నారు.

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ, గోదావరిఖనిలో పెద్దపల్లి డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు పెట్రొలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే లాక్ డౌన్ కొనసాగుతుండగా అనవసరంగా రోడ్ల పైకి వస్తున్న ఆకతాయిలను పట్టుకుని విచిత్రమైన శిక్ష విధించారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న యువకులను పోలీసులు ఐసోలేషన్ కు పంపించారు.

read more తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేస్తారనే వార్తల్లో నిజమెంతా?

ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ... కరోనా నేపథ్యంలో ఇష్టానుసారంగా బయట తిరిగితే కేసులు తప్పవని హెచ్చరించారు. కరోనా వైరస్ భారీ నుండి ప్రజలను రక్షించడానికి పోలీసులు రోడ్లపై ఉంటున్నారని అన్నారు. ఇలా పోలీసులు నిరంతరం ప్రజల కోసం పని చేస్తుంటే కొంతమంది బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారని మండిపడ్డారు. 

కొందరు ఆకతాయిలు ఎంత చెప్పినా వినిపించుకోకుండా గల్లీల్లో, రోడ్లపై తిరుగుతున్నారని... వారికోసమే ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డిసిపి తెలిపారు. ఇకపై ప్రతి రోజు ఉదయం 10 గంటల తరువాత అనవసరంగా రోడ్లపై తిరిగితే వారిని సుల్తానాబాద్ లో ఏర్పాటుచేసిన ఐషోలేషన్ కేంద్రానికి తరలిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ వ్యాన్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయినా మారకపోతే కేసులు పెడతామని డిసిపి హెచ్చరించారు.