తెలంగాణాలో కరోనా వ్యాప్తి రోజురోజుకి ఎక్కువవుతుంది. తన ముందు అందరూ సమానమే అన్నట్టుగా కరోనా వ్యాపిస్తుంది. తాగాజా ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఊపిరి తీసుకోవడంలో నాగేందర్ ఇబ్బంది పడుతున్నారని, అందుకోసమే ఆయన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నట్టుగా తెలియవస్తుంది. ప్రభుత్వాసుపత్రి మీద నమ్మకం ఉండబట్టే ఆయన గాంధీకి చికిత్స కోసం వచ్చినట్టు చెబుతున్నారు. 

ఇకపోతే... తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం కొత్తగా 1,879 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 27,612కి చేరింది. ఇవాళ వైరస్ కారణంగా ఏడుగురు మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 313కి చేరుకుంది.

Also Read:హైదరాబాద్‌లో కార్పోరేట్ ఆసుపత్రుల దందా.. కరోనా రోగులతో వ్యాపారం

మంగళవారం ఒక్క హైదరాబాద్‌లోనే 1,422 కోవిడ్ 19 కేసులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్‌లో 94 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 11,012 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స  పొందుతుండగా... 16,287 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల దందాపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరంలోని కేర్, యశోదా, సన్‌షైన్, మెడికవర్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది. ఎంత ఛార్జీలను వసూలు చేయాలో ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ.. ఆసుపత్రులు పట్టించుకోకపోవడం దారుణమని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Also Read:కేసీఆర్ కు కరోనా సోకిందనుకొని ప్రేయర్ చేసిన కేఏ పాల్

నిబంధనలను ఉల్లంఘించే ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంపై 14వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.