హైదరాబాద్‌లో కార్పోరేట్ ఆసుపత్రుల దందా.. కరోనా రోగులతో వ్యాపారం

కరోనా సోకి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరినవారిని అడ్డగోలుగా దోచుకుంటున్నారు డాక్టర్లు. పోని ప్రాణాలు దక్కుతాయా అంటే అదీ లేదు. ఇది తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రుల పరిస్థితి

private hospitals over high charges for corona treatment in hyderabad

కరోనా సోకి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరినవారిని అడ్డగోలుగా దోచుకుంటున్నారు డాక్టర్లు. పోని ప్రాణాలు దక్కుతాయా అంటే అదీ లేదు. ఇది తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రుల పరిస్థితి. యాదగిరిగుట్టకు చెందిన 26 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని కిమ్స్‌లో చేరాడు.

అయితే 14 రోజుల తర్వాత చనిపోయాడు. చికిత్సకు గాను రూ.12 లక్షల బిల్లు వేసింది ఆసుపత్రి యాజమాన్యం. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు మృతుడి తల్లిదండ్రులు.

అతనికి ఇతర వ్యాధులేవి లేవని, డాక్టర్లే సరైన చికిత్స అందించకపోవడం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. పైగా ఇప్పటికే రూ.6 లక్షల రూపాయలు చెల్లించింది బాధిత కుటుంబం. ఇప్పుడు మరో రూ.6 లక్షలు  చెల్లిస్తే మృతదేహాన్ని చూడనిస్తామని డాక్టర్లు చెబుతున్నారని వారు వాపోతున్నారు.

Also Read:కరోనాకు అధిక ఫీజులు:ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలకు తెలంగాణ హైకోర్టు ఆదేశం

అటు నగరంలోని మరో కార్పోరేట్ ఆసుపత్రి సన్‌షైన్‌పైనా విమర్శలు వెల్లువెత్తాయి. మొండా మార్కెట్‌కు చెందిన 55 ఏళ్ల బాలరాజుకు గత నెల 13న జ్వరం వచ్చింది. దీంతో ఆయన సన్‌షైన్ ఆసుపత్రికి వెళ్లాడు.

అతనిని పరీక్షించిన వైద్యులు కరోనా వచ్చినట్లు నిర్థారించారు. అనంతరం ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.15 లక్షల బిల్లు వేయగా.. రూ.5 లక్షలు చెల్లించింది బాధిత కుటుంబం.

ప్రస్తుతం బాధితుడు వెంటిలేటర్‌పై ఉన్నాడని చెబుతున్న వైద్యులు.. తమకు మాత్రం చూపించడం లేదని చెబుతున్నారు కుటుంబసభ్యులు. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల దందాపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

నగరంలోని కేర్, యశోదా, సన్‌షైన్, మెడికవర్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది. ఎంత ఛార్జీలను వసూలు చేయాలో ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ.. ఆసుపత్రులు పట్టించుకోకపోవడం దారుణమని హైకోర్టు వ్యాఖ్యానించింది.

నిబంధనలను ఉల్లంఘించే ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంపై 14వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios