ఆ విషయంలో కెసిఆర్ కు వెయ్యి ఏనుగుల బలమొచ్చింది

Opposition canot blame KCR now on Dalit CM issue as dalit president is his choice
Highlights

 తెలంగాణ  సిఎం కెసిఆర్ కు వెయ్యి ఏనుగుల బలమొచ్చింది. ఆయనకు ఇప్పుడు వజ్రాయుధం దొరికింది. ఇంతకాలం ఉక్కిరిబిక్కిరి చేసిన విపక్షాలపై విరుచుకుపడనున్నారు కెసిఆర్. తనపై గళమెత్తిన గొంతులకు అడ్డుకట్ట వేయనున్నారు. మొత్తానికి ఈ దెబ్బతో ఆయన విపక్షాల నోరు మూయించడం ఖాయమంటున్నాయి గులాబీ  శ్రేణులు. ఇంతకూ కెసిఆర్ కు దొరికిన ఆ వజ్రాయుధమేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ స్టోరీ చదవండి.

తెలంగాణ రాజకీయాల్లో కెసిఆర్ మాటంటే మాటే. బాహుబలి సినిమాలో మాదిరిగా ఇక్కడ కెసిఆర్ మాటే తెలంగాణలో శాసనం. కానీ ఇంతకాలం ఆ ఒక్క విషయంలో మాత్రం ఆయన వద్ద సమాధానం లేదు. గత మూడేళ్లుగా ఆయనను ఆ విషయంలో ప్రతిపక్షాలు గుక్క తిప్పుకోకుండా ఉక్కిరిబిక్కిరి చేశాయి. కానీ ఇప్పుడు లభించిన ఆయుధంతో ఇకపై విపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు కెసిఆర్.

 

తెలంగాణ సిఎం కు ప్రధాని నరేంద్ర మోడీ  ఫోన్ చేశారు. కెసిఆర్ సూచన మేరకే దళితుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించనట్లు చెప్పారు మోడీ. దీంతో వెంటనే తన  పార్టీ నేతలను సంప్రదించి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన రాంనాథ్ కోవింద్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు  కెసిఆర్. ఈ విషయాన్ని తెలంగాణ సిఎం ఆఫీసు ఒక ప్రకటనలో  తెలిపింది. ప్రధాని మాటలను సైతం సిఎం  ఆఫీసు వెల్లడించడం చర్చనీయాంశమైంది.

 

తెలంగాణ వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి  అవుతాడని కెసిఆర్ గతంలో  అనేకసార్లు ప్రకటించారు. కానీ తెలంగాణ వచ్చాక మాట  తప్పిన కెసిఆర్ తానే సిఎం అయ్యారు. దీంతో దళిత వర్గాల్లో  ఇప్పటికీ కెసిఆర్ తమ వర్గాలకు మాట  ఇచ్చి తప్పినట్లు గుర్రుగానే ఉన్నారు. దీనికితోడు ఉప ముఖ్యమంత్రి గా ఉన్న రాజయ్యను అకారణంగా తొలగించారు కెసిఆర్. ఈ రెండు పరిణామాలు దళితుల్లో కెసిఆర్ పట్ల వ్యతిరేక భావనను కలిగించాయి.

 

ఇదిలా ఉంటే ఈ రెండు అంశాలతో విపక్షాలు టిఆర్ఎస్ ను ఇంతకాలం ఇరుకునపెడుతూ వచ్చాయి. దీనిపై ప్రశ్నించిన ప్రతి సందర్భంలో టిఆర్ఎస్ ధాటవేత ధోరణి అవలంభించింది. కానీ ఇకపై గులాబీదళం విపక్షాలపై విరుచుపడనుంది. ముఖ్యమంత్రిగా  దళితుడిని చేయకపోవచ్చు కానీ కెసిఆర్ సూచన మేరకే దళితుడు దేశాధ్యక్షుడిగా  అయ్యారని ఊరు, వాడలో ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో ఉన్న ప్రతిపక్షాల్లో కాంగ్రెస్, టిడిపి, బిజెపి, వామపక్షాలపై ఇకనుంచి అధికార పార్టీ ఎదురుదాడికి దిగనుంది. సిఎం పోస్టు ఏం ఖర్మ ఒక దళితుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత కెసిఆర్ కే దక్కిందంటూ ప్రచారం చేసుకోనున్నారు.

 

మొత్తానికి దళిత ముఖ్యమంత్రి విషయంలో మూడేళ్లపాటు ఉక్కిరిబిక్కిరైన కెసిఆర్ ప్రధాని ఫోన్ కాల్ పుణ్యమా అని ఊపిరి పీల్చుకోవడమే కాదు ఎదురు దాడికి సైతం ఆయుధం దొరికిందని గులాబీ శ్రేణులు జోష్ మీదున్నాయి.

loader