హైదరాబాద్ శివార్లలోని నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. ఓ పెట్రోల్ బంక్‌లోని పనిచేస్తున్న సిబ్బంది అర్దరాత్రి ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న ఒక వ్యక్తి మరణించాడు.
హైదరాబాద్ శివార్లలోని నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. ఓ పెట్రోల్ బంక్‌లోని పనిచేస్తున్న సిబ్బంది అర్దరాత్రి ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న ఒకరు మరణించగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పెట్రోల్ బంక్ సిబ్బందిపై ముగ్గురు యువకులు దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వివరాలు.. నార్సింగి జన్వాడలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్దకు అర్దరాత్రి ఓ కారు చేరుకుంది. అయితే బంక్ క్లోజ్ చేశామని పెట్రోల్ లేదని అక్కడి సిబ్బంది తెలిపారు. అయితే తాము చాలా దూరం వెళ్లాలని కారులోని ముగ్గురు యువకులు పెట్రోల్ కొట్టాలని.. బంక్ సిబ్బందిని కోరారు. దీంతో బంక్ సిబ్బంది కారులో పెట్రోల్ కొట్టారు.
అయితే డబ్బులు చెల్లించే సమయంలో యువకులు కార్డు ఇచ్చారు. స్వైపింగ్ మిషన్ పని చేయకపోవడంతో నగదు ఇవ్వాల్సిందిగా పెట్రోల్ బంకులో పని చేసే సిబ్బంది వారిని కోరారు. అయితే ఈ క్రమంలోనే ముగ్గురు యువకులు రెచ్చిపోయారు. తమకే ఎదురు చెబుతారా? అంటూ దాడికి పాల్పడ్డారు. క్యాషియర్ చోటుపై దాడి చేశారు. ఈ క్రమంలోనే దాడిని అడ్డుకునేందుకు పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న సంజయ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ముగ్గురు యువకులు సంజయ్‌పై దాడి చేశారు. దీంతో సంజయ్ అక్కడికక్కడే కుప్పకూలాడు. మరోవైపు ముగ్గురు యువకులు కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పెట్రోల్ బంక్ సిబ్బంది సంజయ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సంజయ్ మృతిచెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో సంజయ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక, ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ముగ్గురు నిందితులను జన్వాడ గ్రామానికి చెందిన నరేందర్, మల్లేష్, అనూప్‌లుగా గుర్తించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
