రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాలు లాక్ డౌన్ దిశగా కదులుతున్నారు. ఇప్పటివరకు రెండు గ్రామాలు స్వీయ లాక్ డౌన్ విధించుకున్నాయి.
సిరిసిల్ల: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ (omicron) ఇండియాలోనూ కలకలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ (telangana)లో వేగంగా విజృంభిస్తోంది. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా (rajanna siricilla district)లో రెండు గ్రామాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడటం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు భయటపడ్డ గ్రామాల్లో ప్రజలు అప్రమత్తమై స్వీయ లాక్ డౌన్ (lock down) విధించుకున్నారు.
సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామస్తులు రెండురోజుల పాటు లాక్ డౌన్ విధించుకున్నారు. ఈ గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు ఇటీవల విదేశాల నుండి వచ్చాడు. అతడికి ఒమిక్రాన్ నిర్దారణ కావడంతో అప్రమత్తమైన గ్రామస్తులు డిసెంబర్ 29, 30 తేదీల్లో (ఇవాళ, రేపు) లాక్ డౌన్ విధించుకున్నారు.
Video
ఈ రెండు రోజులు నారాయణపూర్ (narayanapur) గ్రామంలోని అన్ని రకాల దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసి వేయాలని గ్రామస్తులు తీర్మానించుకున్నారు. అయితే నిత్యావసర సరుకుల కోసం కేవలం కిరాణా షాపులకు మాత్రం తెల్లవారుజాము నుండి ఉదయం 10 గుంటల వరకు, సాయంత్రం 6 గంటలు నుండి 8 గంటలు వరకు తెరుచివుంచేందుకు అవకాశమిచ్చారు.
read more తెలంగాణలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. కొత్తగా ఏడుగురికి పాజిటివ్, 62కి చేరిన కేసులు
ఇదిలావుంటే ఇప్పటికే మూడు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డ ఇదే సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇటీవలే స్వగ్రామానికి వచ్చిన గల్ఫ్ కార్మికుడికి మాత్రమే కాదు అతడి భార్య, తల్లికి కూడా ఒమిక్రాన్ నిర్దారణ అయ్యింది. దీంతో వైద్య సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద టిమ్స్ కు తరలించారు.
అయితే ఒమిక్రాన్ గ్రామంలో వ్యాప్తి చెందకుండా గూడెం గ్రామస్తులు స్వీయ లాక్ డౌన్ విధించుకున్నారు. గ్రామస్తులు పది రోజులపాటు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. బయటవారు గ్రామంలోకి రాకుండా, గ్రామస్తులు బయటకు పోకుండా చర్యలు తీసుకున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
ఇటీవల దుబాయ్ నుండి సిరిసిల్ల జిల్లా గూడెం గ్రామానికి వచ్చిన పిట్ల రాంచంద్రం అనే వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. దీంతో అతడిని హైదరాబాద్ (hyderabad) లోని టిమ్స్ (TIMS) కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అతడి కుటుంబసభ్యులతో పాటు స్నేహితులక కూడా వైద్యసిబ్బంది టెస్టులు చేసారు. ఈ క్రమంలోనే రాంచంద్రం తల్లి దేవమ్మ, భార్య మౌనికకు కరోనా పాజిటివ్ తేలింది. వారి నుండి శాంపిల్ సేకరించి జీనోమ్ సీక్వెల్ పరీక్ష చేయగా ముగ్గురికీ ఒమిక్రాన్ నిర్దారణ అయ్యింది. దీంతో వెంటనే ఈ ముగ్గురిని వైద్యంకోసం హాస్పిటల్ కు తరించారు.
read more తెలంగాణలో ఒమిక్రాన్ సెకండ్ కాంటాక్ట్ మొదటి కేసు.. ప్రమాదం అంటున్న వైద్యులు..
ఇక తెలంగాణలో ఒక్క మంగళవారమే ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62 కు చేరింది. ఇలా కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది. కొత్త సంవత్సరం వేడుకలపై ఇప్పటికే ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అలాగే మాస్క్ ధరించకుండా బయటకు వస్తే భారీగా ఫైన్ విధిస్తున్నారు.
