తన చితి తానే పేర్చుకొని ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్ధిపేట జిల్లాలో జరిగింది. వంతుల వారీగా కుమారుల దగ్గర ఉండటం ఇష్టం లేక ఆ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. 

వంతుల వారీగా కుమారుల దగ్గర ఉండటం ఇష్టం లేక ఓ వృద్ధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తన చితిని తానే పేర్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా ఒక్క సారిగా సంచలనం రేకెత్తించింది. 

విషాదం.. రైతుపై దాడి చేసిన కోతుల గుంపు.. తప్పించుకునే క్రమంలో మేడపై నుంచి పడటంతో మృతి

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన 90 ఏళ్ల మెడబోయిన వెంకటయ్యకు నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పిల్లలందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు కుమారులు ఊర్లో, మరో ఇద్దరు కూమరులు వేరే వేరే చోట నివసిస్తున్నారు. కొంత కాలం కిందట భార్య చనిపోయింది. దీంతో ఆయన పెద్ద కుమారుడు కనకయ్య వద్ద ఉండేవాడు. అయితే ఆ వృద్ధుడి పోషణ విషయంలో కుమారుల మధ్యన విభేదాలు వచ్చాయి. 

దీంతో ఐదు నెలల కిందట పెద్ద మనుషులు పంచాయితీ పెట్టారు. నలుగురు కుమారులూ వెంకటయ్యను పోషించాలని వారు నిర్ణయించారు. నెలకు ఒకరి చొప్పున వంతుల వారీగా వృద్ధుడిని ఉంచుకొని, ఆయన పోషణ చూసుకోవాలని పెద్దలు నలుగురు కుమారులకు చెప్పారు. పెద్దల నిర్ణయం ప్రకారం మొదటి నెల గ్రామంలోనే ఉండే పెద్ద కుమారుడు కనకయ్య వద్ద ఉన్నాడు. తరువాత నెల నవాబుపేటలో ఉంటున్న మరో కుమారుడి దగ్గరకు వెళ్లాల్సి ఉంది.

కానీ పుట్టిన ఊరిని, తను ఎన్నో ఏళ్లు గడిపిన ఇంటిని వదిలి వెంకటయ్యకు వెళ్లబుద్ది కాలేదు. ఎంతో మనోవేదనతో ఈ నెల 2వ తేదీన సాయంత్రం సమయంలో తన ఇంటి నుంచి బయలుదేరాడు. కుమారుడు దగ్గరకు వెళ్లకుండా గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంటికి చేరుకున్నాడు. ఆయనతో తన బాధ చెప్పుకున్నాడు. ఆ రాత్రి అక్కడే బస చేశాడు. ఇక చేసేదేమీ లేక నవాబుపేటలో ఉన్న తన 
కుమారుడు దగ్గరకు వెళ్లానని చెప్పి మరుసటి రోజు ఉదయం బయలుదేరాడు. 

బజరంగ్ దళ్ నిషేధం విషయంలో వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ? అలాంటి ప్రతిపాదనేమీ పార్టీకి లేదన్న వీరప్ప మొయిలీ

కానీ ఆ రోజు సాయత్రం వరకు ఏ కుమారుడి దగ్గరకు చేరుకోలేదు. అయితే గురుమారం మధ్యాహ్నం సమయంలో తన సొంత గ్రామమైన పొట్లపల్లి ఎల్లమ్మగుట్ట దగ్గర ఓ వృద్ధుడి మృతదేహం లభించింది. మంటల్లో కాలిన స్థితిలో ఆ మృతదేహం ఉంది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఆ మృతదేహం తమ తండ్రిదేనని కుమారులు గుర్తించారు. అక్కడ తాటికమ్మలు ఒక దగ్గరకు తీసుకొచ్చి, చితిలా మార్చుకొని, దానికి నిప్పంటించి ఆత్మహత్యకు ఒడిగటినట్టు భావిస్తున్నారని ‘ఈనాడు’ పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. 

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.