హైదరాబాద్: అనూహ్యంగా తెలంగాణ గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం బిజెపి క్రియాశీలక నాయకురాలు తమిళిసాయి సౌందర రాజన్ ను నియమించింది. దీంతో బిజెపి తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలని నిర్ణయించుకుందనే ప్రచారం సాగుతోంది. 

2023లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని ఓడించే ప్రణాళికలో భాగంగానే తమిళిసాయిని గవర్నర్ గా నియమించిందని భావిస్తున్నారు. ఆమె నియామకంతో ఎన్టీ రామారావు, కుముద్ బెన్ జోషీల మధ్య విభేదాలు, అప్పటి వ్యవహారాలు ఓసారి గుర్తుకు వస్తున్నాయి. ఆ ఎపిసోడ్ తెలంగాణలో పునరావృతమవుతుందా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. 

రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో 1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా కుముద్ బెన్ జోషీని కేంద్రం నియమించింది. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గవర్నరుగా నియమితులైన సమయంలో కుముద్ బెన్ జోషీ కాంగ్రెసులో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 

కుముద్ బెన్ జోషీ గవర్నరుగా వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. రాజభవన్ కాంగ్రెసు కార్యాలయంగా మారిందనే విమర్శలు కూడా వచ్చాయి. బిజెపి కూడా తమిళిసాయిని గవర్నరుగా నియమించడం ద్వారా అదే పనిచేయబోతుందా, కేసీఆర్ కూ టీఆర్ఎస్ కూ చిక్కులు కల్పించబోతుందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 

కుముద్ బెన్ జోషీ 1985 నవంబర్ 26 నుంచి 1990 ఫిబ్రవరి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా ఉన్నారు. గవర్నరుగా పదవీ బాధ్యతలు చేపట్టగానే ఆమె రాష్ట్రంలోని 23 జిల్లాల్లో పర్యటించారు. కాంగ్రెసుకు బలమైన పునాదిని ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే కుముద్ బెన్ జోషీ అ పని చేశారనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. 

ఎన్టీ రామారావుకు, కుముద్ బెన్ జోషీకి మధ్య విభేదాలు ఆమె శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా బాహాటంగానే వ్యక్తమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో కుముద్ బెన్ జోషీకి సహకరించవద్దని ఎన్టీ రామారావు తన పార్టీ గానీ, అధికార యంత్రంగాం గానీ సహకరించవద్దని ఆదేశించారు. రాజభవన్ ద్వారా ఆమె దాదాపు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడిపారు. వైస్ చాన్సలర్లతో ఆమె చర్చలు జరిపారు. కాంగ్రెసు నేతల్లో ఎవరో ఒకరు ఆమెను నిత్యం కలుస్తూ ఉండేవారు.

తమిళిసాయి కూడా బిజెపి నాయకులకు అందుబాటులో ఉంటారని, తద్వారా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే అవకాశం ఉందని అంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చే పెట్టేందుకు అవసరమైన పనులన్నీ ఆమె చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గవర్నర్ నుంచి కేసీఆర్ కు ఏ విధమైన చిక్కులు కూడా రాలేదు. నరసింహన్ కేసీఆర్ కు అన్ని విధాలుగా సహకరిస్తూ వచ్చారు. నరసింహన్ స్థానంలో తమిళిసాయి వస్తుండడంతో కేసీఆర్ కు తిప్పలు తప్పకపోవచ్చునని అంటున్నారు. 

 

సంబంధిత వార్తలు

నరసింహన్: ఆరుగురు సీఎంలు, 9 ఏళ్ల పాటు గవర్నర్ పదవిలోనే....

తమిళిసై టఫ్: కేసీఆర్ ను కలవరపెట్టడానికే బిజెపి ప్లాన్

నరసింహన్‌‌తో రెండు గంటల చర్చలు: కేసీఆర్ ప్లాన్ ఇదీ

హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌‌గా నియామకం: స్పందించిన దత్తాత్రేయ

విలువలు, క్రమశిక్షణ, విధేయత: దత్తన్న రాజకీయ ప్రస్థానం

తెలంగాణ గవర్నర్ నరసింహాన్ బదిలీ?

నరసింహన్ బదిలీ: తెలంగాణకు సౌందర రాజన్, హిమాచల్‌కు దత్తన్న

ప్రత్యక్ష ఎన్నికల్లో కలిసిరాని విజయం... వరించిన గవర్నర్ గిరి

దత్తాత్రేయకు బీజేపీ కార్యకర్తల అభినందనలు (ఫోటోలు)