Asianet News TeluguAsianet News Telugu

ఎంబీబీఎస్‌లోనే ర్యాగింగ్, పీజీలో ఉండదు: మెడికో ప్రీతి ఆరోగ్యంపై డీఎంఈ ఆరా

వరంగల్  కేఎంసీ  మెడికో  డాక్టర్  ప్రీతి  ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగా  ఉందని  డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి  చెప్పారు.

No Ragging  On  Medico  Preethi  Says  DME  Ramesh Reddy
Author
First Published Feb 23, 2023, 12:29 PM IST

హైదరాబాద్: వరంగల్ కేఎంసీ మెడికో  ప్రీతిపై  ర్యాగింగ్  జరగలేదని  డీఎంఈ  డాక్టర్ రమేష్ రెడ్డి  ప్రకటించారు.  హైద్రాబాద్  నిమ్స్ ఆసుపత్రిలో  మెడికో  ప్రీతికి చికిత్స అందిస్తున్నారు.  ప్రీతికి  అందుతున్న వైద్యం  వివరాలను  డీఎంఈ  రమేష్  రెడ్డి  ఆరా తీశారు.  డాక్టర్ ప్రీతి  కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం  చెప్పారు.  

గురువారం నాడు నిమ్స్ ఆసుపత్రి వద్ద  డీఎంఈ  డాక్టర్ రమేష్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు.  ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే  ఉందని డాక్టర్ రమేష్ రెడ్డి  చెప్పారు.  వెంటిలేటర్ పై  డాక్టర్ ప్రీతికి  వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. 

 పీజీ స్టూడెంట్స్  మధ్య  ర్యాగింగ్  ఉండదని  డీఎంఈ  డాక్టర్ రమేష్ రెడ్డి  చెప్పారు. అండర్ గ్రాడ్యుయేషన్ లో  ఫస్టియర్, సెకండియర్  లో  ర్యాగింగ్   ఉంటే  ఉండొచ్చని ఆయన  చెప్పారు.   డాక్టర్ ప్రీతి విషయంలో ఏ రకమైన వేధింపులు జరిగాయనే విషయమై  విచారణ జరుగుతుందన్నారు. విధుల విషయంలో  సీనియర్ గా  తాను  మెడికో ప్రీతికి చెప్పానని  తమకు  సీనియర్ స్టూడెంట్  సైఫ్ నుండి సమాధానం వచ్చిందన్నారు.   డాక్టర్ ప్రీతితో  పనిచేసే ఇతర  మెడికోలను కూడా  ఈ విషయమై విచారణ చేస్తే కానీ  వాస్తవాలు బయటకు రావన్నారు.  

 ప్రీతి ఆత్మహత్యాయత్నం  చేసుకోవడానికి రెండు రోజుల ముందే  వీరిద్దరికి  కౌన్సిలింగ్  కూడా ఇచ్చామని  రమేష్ రెడ్డి  చెప్పారు.  ఈ ఘటనపై  కమిటీని కూడా  ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా  చర్యలు తీసుకుంటామని  ఆయన తేల్చి చెప్పారు.  ప్రీతిని కాపాడేందుకు  నిమ్స్ వైద్యులు  ప్రయత్నాలు చేస్తున్నారని  ఆయన  చెప్పారు. 

also read:వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం: సైఫ్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు

ఈ నెల  22న  మెడికో  డాక్టర్  ప్రీతి  ఆత్మహత్యాయత్నం  చేసుకుందని కుటుంబ సభ్యులు  చెబుతున్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం  చేసుకుందా  ఇతరత్రా కారణాలున్నాయా  అనే విషయం  తేలాల్సి ఉందని  ఎంజీఎం  సూపరింటెండ్   డాక్టర్  చంద్రశేఖర్ ప్రకటించారు.  మెడికో డాక్టర్ ప్రీతిని  సీనియర్  సైఫ్   వేధిస్తున్నాడని  కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios