హైదరాబాద్: ఆంధ్ర ఆక్టోపస్ గా పేరు పొందిన మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఎన్నికల సర్వేలపై విశ్వసనీయత ఉంది. ఇప్పటి వరకు ఆయన చేసిన ఎగ్జిట్ పోల్ లేదా ప్రీ పోల్ సర్వేలు వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఉండడమే ఆందుకు కారణం. ఈ స్థితిలో తెలంగాణ శాసనసభ ఎన్నికలపై ఆయన నిర్వహించిన సర్వేపై ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు తెలంగాణ ఎన్నికల్లో గెలుస్తారని చెబుతూ ఆ ఇద్దరి పేర్లు ఆయన శుక్రవారం తిరుపతిలో వెల్లడించడం సంచలనం సృష్ఠించింది. తెలంగాణలో 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని ఆయన జోస్యం చెప్పారు. ఆ స్వతంత్రులు బిఎల్ఎఫ్, బిఎస్పీ వంటి పార్టీల నుంచి పోటీ చేస్తున్న విషయాన్ని ఆయన కాదనలేదు. 

అయితే, తెలంగాణలో హంగ్ రాదని ఆయన కచ్చితంగానే చెబుతున్నారు. పది సీట్లను స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్నా ఇంకా 109 సీట్లు ఉంటాయి కాబట్టి హంగ్ వచ్చే పరిస్థితి లేదని ఆయన అంటున్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. 

తాను ఆగస్టులో ఓ టీవీ చానెల్ కోసం సర్వే చేశానని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కే. చంద్రశేఖర రావుకు అనుకూలంగా ఉందని ఆయన చెప్పారు. ప్రజా కూటమి గానీ టీఆర్ఎస్ గానీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని లగడపాటి అంటూ అయితే ఏది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విషయాన్ని వెల్లడించడానికి నిరాకరించారు. 

డిసెంబర్ 7వ తేదీన తాను తన సర్వే ఫలితాలను వెల్లడిస్తానని, అంత వరకు ఓపిక పట్టాల్సిందేనని లగడపాటి అన్నారు. లగడపాటి గెలుస్తారని చెప్పిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా కాంగ్రెసు పార్టీకి చెందినవారే. 

సంబంధిత వార్తలు

కేసీఆర్ సన్నాసి అన్నది నన్ను కాదు, నాపేరు ఎక్కడా అనలేదు:లగడపాటి

నేను చెప్పిన స్వతంత్రుల అంశం నిజమే:లగడపాటి

లగడపాటివి వెకిలి సర్వేలు, ప్రజలు ఆగం కావొద్దు:కేసీఆర్

తెలంగాణలో స్వతంత్రులే కింగ్‌మేకర్లు: లగడపాటి సంచలన సర్వే