- Home
- Telangana
- IMD Rain Alert : ఆల్రెడీ ఇక్కడ గాలివాన బీభత్సం ... కొద్దిసేపట్లో ఈ జిల్లాల్లోనూ అల్లకల్లోలమే
IMD Rain Alert : ఆల్రెడీ ఇక్కడ గాలివాన బీభత్సం ... కొద్దిసేపట్లో ఈ జిల్లాల్లోనూ అల్లకల్లోలమే
IMD Rain Alert : ఈ రోజు (సోమవారం, మే 25) మధ్యాహ్నం ఎండ దంచికొడుతోంది. మరికొద్దిసేపట్లో వాతావరణం పూర్తిగా మారిపోబోతోందని… ఈ తెలుగు జిల్లాల్లో భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎండావానలు...
IMD Rain Alert : రోహిణి కార్తె వచ్చేసింది... దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇదే సమయంలో రుతుపవనాలు కూడా అండమాన్ నికోబార్ దీవులను దాటి దేశంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి.. దీంతో వర్షాలు కూడా మొదలయ్యాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భానుడి భగభగలు కొనసాగుతున్నాయి... ఇక సాయంత్రం అయ్యిందంటే వర్షాలతో వాతావరణం చల్లబడుతోంది. ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండావాన పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఈ సాయంత్రం జోరువానలు...
తెలంగాణలో ప్రస్తుతం (మే 25, మధ్యాహ్నం) ఎండ మండిపోతోంది... చాలాచోట్ల 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వడగాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు ప్రజలకు వాతావరణ నిపుణులు తెలంగాణ వెదర్ మ్యాన్ చల్లని కబురు అందిస్తున్నారు. ఈ సాయంత్రం అంటే మరికొద్ది గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ముఖ్యంగా నల్గొండ, వికారాబాద్, రంగారెడ్డి (మహేశ్వరం, శంషాబాద్, ఇబ్రహీంపట్నం వంటి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో), సంగారెడ్డి (జహిరాబాద్ ప్రాంతం), మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
కామారెడ్డి, మెదక్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. సౌత్ హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా సాయంత్రం చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఈదురుగాలులు, పిడుగుల వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలు పెద్దపెద్ద హోర్డింగ్స్, చెట్లు, కరెంట్ స్తంభాల వద్ద ఉండరాదని జాగ్రత్తలు సూచిస్తున్నారు తెలంగాణ వెదర్ మ్యాన్.
ఇప్పటికే మెదక్ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం మొదలయ్యింది. ఒక్కసారిగా ఆకాశం మేఘాలతో కమ్మేసి వర్షం మొదలయ్యింది... దీనికి ఈదురుగాలులు, వడగళ్లు తోడవడంతో బీభత్సం కొనసాగింది. ఈ అకాల వర్షాలతో ఇబ్బందులు తప్పడంలేదని ప్రజలు, పంటనష్టం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Heavy rain
In #medak @balaji25_t @telangana_rains pic.twitter.com/IR6kYEeSMQ— Prashanth Enagandula (@ImPrashanth15) May 25, 2026
తెలంగాణ వాతావరణ సమాచారం...
హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా ఇవాళ (మే 25, సోమవారం) మండుటెండలు, వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి , నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలుంటాయని ప్రకటించింది.
ఇక రేపు (మే 26, మంగళవారం) కూడా ఇదే పరిస్థితి ఉంటుందట. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యధిక ఎండలు (45 డిగ్రీలకు పైగా) ఉంటాయంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, జనగాం జిల్లాల్లో 40 నుండి 45 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు ఉంటాయట... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. రాత్రి సమయంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి జిల్లాల్లో ఉక్కపోత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) May 25, 2026
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు...
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఇవాళ (సోమవారం) మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, మిగిలిన రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఇలా ఓవైపు వర్షాలు కురిసి సాయంత్రం వాతావరణం చల్లబడుతున్నా మధ్యాహ్నం మాత్రం సూర్యుడి నిప్పులు కురిపిస్తున్నాడు. ఏపీలో అయితే ఎండలు రికార్డు స్థాయికి చేరాయి. ఆదివారం (మే 24) ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిట్యాలలో (తూర్పుగోదావరి జిల్లా) ఏకంగా 48.3°C ఉష్ణోగ్రత రికార్డయ్యింది. మరో 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని APSDMA హెచ్చరిస్తోంది.. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

