కాగజ్ నగర్:  ఎన్నికల ప్రచార సభలో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఓ యువకుడిని తిట్టిపోయడాన్ని కాంగ్రెసు తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. తెలంగాణ పిసిసి ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేసి, కేసీఆర్ ప్రవర్తనను విమర్శించింది. 

అంతేకాకుండా కేసీఆర్ ను నియంతగా అభివర్ణించింది. అధికారం మత్తులో కేసీఆర్ నియంత మాదిరిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెసు పార్టీ ట్వీట్ చేసింది. " మిస్టర్ కేసీఆర్! తెలంగాణ ప్రజలకు మీరు జవాబుదారీవి. ప్రజాస్వామ్యంలో అహంకారానికి, నియంతృత్వానికి చోటు లేదు" అని వ్యాఖ్యానించింది.

 

ఓ యువకుడు వేసిన ప్రశ్నకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు సహనం కోల్పోయారు. అతన్ని తిట్టిపోశారు. 

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ ప్రసంగిస్తుండగా, ప్రేక్షకుల్లోంచి ఓ యువకుడు లేచి 12 శాతం మైనారిటీ కోటా అమైందంటూ ప్రశ్నించాడు. 

దాంతో కేసీఆర్ సహనం కోల్పోయి "బాత్ కర్తే, బైఠో కామోష్ బైఠో. వోబీ బారాహ్ పర్సెంట్ హై బోలే కామోష్ బైఠో... బైఠ్ జావో (ఏం మాట్లాడుతున్నావు. నోరు మూసుకుని కూర్చో. ఆ 12 శాతం గురించే చెబుతున్నా. నోరు మూసుకుని కోర్చుండు)" అని అన్నారు. 

"నేను చెబుతా, ఎందుకు తొందరపడుతున్నావు" అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ యువకుడు కూర్చోకపోవడంతో... "నోరు మూసుకో. చప్పుడు చేయకుండా కూర్చో. మాటలు నీ బాపుకు చెప్పాలా? ఎందుకు తమాషా చేస్తున్నావు?" అని గద్దించారు.