Hyderabad: రంజాన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయకుండా.. కేవలం హిందూ పండుగలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఈ అసమానత ఎందుకు? నిబంధనలన్నీ ఏమయ్యాయి? వారికి (ముస్లింలకు) ప్రత్యేక చట్టాలు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.
Telangana BJP president Bandi Sanjay Kumar: హైదరాబాద్ పాతబస్తీలో రంజాన్ మాసంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్.. ముస్లిం సమాజం జరుపుకునే పండుగల పట్ల భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆదివారం జరిగిన ములుగు పోలింగ్ బూత్ సమ్మేళనంలో బండి మాట్లాడుతూ పాతబస్తీ ప్రాంతంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఎందుకు నిర్వహించలేదని అన్నారు. ఏడాది పొడవునా విపరీతమైన చలాన్లతో సామాన్యుల జేబులు దోచుకుంటున్నారని ఆరోపించారు.
"హిందూ పండుగ సమయాల్లో వారు అన్ని దుకాణాలను మూసివేస్తారు, కానీ ఇతర మతాల పండుగల సమయంలో వారు తెల్లవారు జామున దుకాణాలు తెరిచినా వారు పట్టించుకోరు" అని బండి సంజయ్ అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఈ అసమానత ఎందుకు? నిబంధనలన్నీ ఏమయ్యాయి? వారికి (ముస్లింలకు) ప్రత్యేక చట్టాలు ఎందుకని" ప్రశ్నించారు. పాతబస్తీలో సభ నిర్వహించాలన్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ ను బీజేపీ స్వీకరించిందని సంజయ్ తెలిపారు.
ఇటీవల శ్రీరామనవమి రోజున ఇద్దరు పార్టీ కార్యకర్తలపై దాడి జరిగిందనీ, అలాంటి దాడులను అంతం చేస్తామన్నారు. "మా పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగితే, హిందూ మతానికి ప్రమాదం జరిగితే, అనుమతి తీసుకునే పిరికివాళ్లం కాదు... ఆకుపచ్చ జెండాల స్థానంలో కాషాయ జెండాలు వేస్తాం" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత జనాభాలో 80 శాతం మంది హిందువులు ఆరాధించే శ్రీరాముడి జన్మస్థలంలో రామ మందిరాన్ని కూడా నిర్మించలేకపోయినందుకు విదేశీయులు మమ్మల్ని ఎగతాళి చేస్తుంటే మనం మౌనంగా ఉండాలా అని ప్రశ్నించారు.
