డెక్కన్ మాల్ లో డెడ్ బాడీలను గుర్తించలేదు: జిల్లా కలెక్టర్
సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలోని డెక్కన్ నైట్ వేర్ భవనంలో డ్రోన్ కెమెరాలతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలోని డెక్కన్ నైట్ వేర్ భవనంలో డ్రోన్ల ద్వారా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ భవనంలో ఏ అంతస్తులో ఏ రకమైన పరిస్థితి ఉందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ భవనంలో పరిస్థితిని జిల్లాకలెక్టర్ ఆమోయ్ కుమార్ శుక్రవారం నాడు పరిశీలించారు. భవనంలోని ప్రతి అంతస్థులో పరిస్థితిని డ్రోన్ కెమెరా ద్వారా అధికారులు పరిశీలించారు.
ఈ భవనంలలోని రెండో అంతస్థులో రెండు మృతదేహలను గుర్తించినట్టుగా కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. అయితే ఈ భవనంలో ఎలాంటి మృతదదేహలు ఇప్పటివరకు గుర్తించలేదని కలెక్టర్ ప్రకటించారు. మృతదేహలు కానీ ఇతర విషయాలను గుర్తిస్తే తాము ప్రకటిస్తామని కలెక్టర్ తేల్చి చెప్పారు. ఈ భవనం నుండి ఇంకా పొగ వస్తుంది. ఈ పొగ నాలుగైదు గంటల తర్వాత తగ్గిపోయే అవకాశం ఉందని కలెక్టర్ చెప్పారు. పొగ తగ్గిన తర్వాత ఈ భవనంలో ఏముందనే విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.ఈ భవనాన్ని పరిశీలించిన నిట్ డైరెక్టర్ ఇంకా నివేదికను ఇవ్వాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ వివరించారు.
also read:షార్ట్ సర్క్యూట్ కారణం కాదు: రాంగోపాల్ పేట అగ్ని ప్రమాదంపై విద్యుత్ శాఖాధికారి శ్రీధర్
నిన్న ఉదయం డెక్కన్ మాల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి ఎనిమిది గంటల సమయంలో అతి కష్టం మీద మంటలను ఆర్పివేశారు. అయితే ఇవాళ ఉదయం ఈ భవనం సెల్లార్ లో మంటలు చెలరేగాయి. ఈ భవనంలో నిల్వ ఉంచిన సింథటిక్ మెటీరియల్ కారణంగా మంటల తీవ్రత ఎక్కువగా ఉందని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. మంటల ధాటికి స్లాబ్ లు కూలి మెటీరి యల్ పై పడినట్టుగా ఫైర్ ఫైటర్లు చెబుతున్నారు. నిన్నటి నుండి ఈ భవనంలో మంటలు ఉన్న కారణంగా ఇవాళ భవనం మొత్తం దెబ్బతిందని అధికారులు అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో ముగ్గురు కార్మికులు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయమై ఇంకా నిర్ధారణ చేసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ఈ భవనంలోపలే సెల్ ఫోన్ సిగ్నల్స్ ను పోలీసులు గుర్తించారు.