షార్ట్ సర్క్యూట్ కారణం కాదు: రాంగోపాల్ పేట అగ్ని ప్రమాదంపై విద్యుత్ శాఖాధికారి శ్రీధర్
సికింద్రాబాద్ డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ శాఖాధికారి శ్రీధర్ చెప్పారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ నైట్ వేర్ స్టోర్ భవనంలో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ శాఖాధికారి శ్రీధర్ చెప్పారు.,డెక్కన్ నైట్ స్టోర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగితే సెల్లార్ నుండి మంటలు వ్యాపించేవని ఆయన అభిప్రాయపడ్డారు. భవనంలో పై నుండి కిందకు మంటలు వచ్చినట్టుగా విద్యుత్ శాఖాధికారి మీడియాకు చెప్పారు.
భవనంలో మంటు వ్యాపిస్తున్న సమయంలో కూడా ఈ భవనంలో ఉన్న విద్యుత్ మీటర్లలో విద్యుత్ ఉందని శ్రీధర్ చెప్పారు. ఈ భవనంలో అగ్ని ప్రమాదం జరిగిందని తమకు సమాచారం రాగానే ఈ ప్రాంతంలో విద్యుత్ ను నిలిపివేసినట్టుగా విద్యుత్ శాఖాధికారి చెప్పారు. నిన్న ఉదయం 11:20 గంటల నుండి సాయంత్రం 06:20 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టుగా విద్యుత్ శాఖాధికారులు తెలిపారు. నిన్న సాయంత్రం పోలీసుల అనుమతితో ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను పునరుద్దరించినట్టుగా విద్యుత్ శాఖాధికారి శ్రీధర్ చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన భవనం మినహా ఈ ప్రాంతమంతా విద్యుత్ ను పునరుద్దరించినట్టుగా ఆయన వివరించారు.
డెక్కన్ నైట్ స్టోర్ లో నిన్న ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం తో భవనం మొత్తం పూర్తిగా కాలి బూడిదైంది. ఆరు అంతస్థుల్లో మంటల ధాటికి భవనం పూర్తిగా దెబ్బతింది. భవనంలోని కొన్ని ఫ్లోర్లలో స్లాబ్ లు కూడా కుప్పకూలిపోయాయి. ఈ భవనం బలహీనంగా ఉందని వరంగల్ నిట్ డైరెక్టర్ రమణారావు చెప్పారు. ఈ భవనం కూల్చివేస్తే పక్క భవనాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రమణారావు అభిప్రాయపడ్డారు.
also read:డెక్కన్ స్టోర్ కూలిస్తే ఇతర భవనాలకు నష్టం: రాంగోపాల్ పేట ప్రమాదంపై నిట్ డైరెక్టర్
సుమారు 11 గంటల పాటు శ్రమించిన తర్వాత ఈ భవనంలో మంటలను ఫైర్ ఫైటర్లు అదుపులోకి తీసుకు వచ్చారు. అయితే ఇవాళ ఉదయం సెల్లార్ లో మరోసారి మంటలు వచ్చాయి. ఈ మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ భవనంలోనే మరో ముగ్గురు చిక్కుకుపోయి ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ భవనంలోపల పరిశీలిస్తే కానీ ఈ విషయం నిర్ధారించలేమని అధికారులు చెబుతున్నారు. మరో వైపు ఈ ముగ్గురు కార్మికుల సెల్ ఫోన్లు ప్రమాదానికి గురైనట్టుగా సిగ్నల్స్ ను పోలీసులు గుర్తించారు.