Asianet News TeluguAsianet News Telugu

బోధన్ మున్సిపల్‌ ఛైర్మన్‌పై అవిశ్వాసం.. కవిత చక్రం.. తీర్మానం నెగ్గుతుందా..?

దేశం మొత్తం పార్లమెంట్‌లో కేంద్రప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడుకుంటుంటే.. తెలంగాణలో రెండు మున్సిపల్ ఛైర్మన్లపై అవిశ్వాసం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది

no confidence motion against bodhan municipal chairman

దేశం మొత్తం పార్లమెంట్‌లో కేంద్రప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడుకుంటుంటే.. తెలంగాణలో రెండు మున్సిపల్ ఛైర్మన్లపై అవిశ్వాసం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. భువనగిరి మున్సిపల్ ఛైర్మన్ లావణ్యపై సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో ఆమె పదవిని కోల్పోయారు. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ ఛైర్మన్ ఎల్లయ్యపై పెట్టిన అవిశ్వాసం ఏకంగా అధికార పార్టీనే కలవరపరిచింది.

టీఆర్ఎస్‌కు చెందిన ఆయన ఈ నెల 3తో నాలుగేళ్ల పదవికాలాన్ని పూర్తి చేసుకున్నారు.. అభివృద్ధి పనులు పట్టించుకోవడం లేదని.. హరితహారం సహా పలు పనుల్లో అవకతవకలకు పాల్పడినా ఇప్పటి వరకు చర్యలు లేవంటూ.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం సహా 29 మంది కౌన్సిలర్లు కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానాన్ని అందించారు. దీనిని పరిశీలించిన కలెక్టర్ ఈ నెల 25న ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ఓటింగ్  నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

ఇది టీఆర్ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారడంతో అవిశ్వాసం ఓటింగ్‌కు రాకుండా ఉండేందుకు ఏకంగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె.. ఎంపీ కవిత రంగంలోకి దిగారు. కౌన్సిలర్లందరినీ తన వైపుకు తిప్పుకునేందుకు చకచక పావులు కదిపారు.. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని కౌన్సిలర్లను ఆదేశించారు.

మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీ కూడా తన కౌన్సిలర్లతో ఎంపీ కవితను కలిసి.. ఓటింగ్‌కు దూరంగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఛైర్మన్‌పై అవిశ్వాసం నెగ్గుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఓటింగ్‌కు సరిపడా కోరం లేనిపక్షంలో అవిశ్వాసం వీగిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios