పైరవీల్లేకుండా గృహలక్ష్మీ.. రెండు నెలల్లో పనులు మొదలుపెట్టకపోతే వేరేవారికి అవకాశం: మంత్రి హరీశ్ రావు
పైరవీలు లేకుండా గృహ లక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే తనకు చెప్పాలని తెలిపారు. అంతేకాదు, లబ్దిదారులు రెండు నెలల్లో పనులు మొదలు పెట్టాలని, లేదంటే వారి స్థానంలో మరొకరిని లబ్దిదారుడిగా ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.

హైదరాబాద్: మంత్రి హరీశ్ రావు ఈ రోజు సిద్ధిపేటలో గృహలక్ష్మీ పథకం లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఇందుకోసం సిద్ధిపేట జిల్లా కేంద్రం కొండ మల్లయ్య గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గృహలక్ష్మీ పథకాన్ని ఎలాంటి పైరవీలు లేకుండా అమలు చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా తప్పుదారిన ఈ పథకం కోసం డబ్బులు అడిగితే తనకు చెప్పాలని అన్నారు.
గృహలక్ష్మీ పథకం కింద డబ్బులను ఆ ఇంటి మహాలక్ష్మీ పేరు మీద అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. మహిళలు డబ్బులను సద్వినియోగం చేస్తారని వివరించారు. ఈ పథకం అందరికీ ఏకకాలంలో అమలు చేయడం సాధ్యం కాదని, ముందూ వెనుకా అందరికీ ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో లంచాలు ఇచ్చినా ఇల్లు దక్కకపోతుండేనని ఆరోపించారు. కాళ్లు అరిగే దాకా తిరిగే వారని వివరించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మధ్యవర్తులు లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొన్నారు.
పంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్ అందరూ అందుబాటులో ఉండి డబ్బులు ఇప్పిస్తారని, అయితే.. లబ్దిదారులు వెంటనే పని మొదలు పెట్టాలని సూచించారు. రెండు నెలల వరకు చూసి అప్పటికీ పని ప్రారంభించకపోతే వారి స్థానంలో మరొకరిని లబ్దిదారులుగా ఎంపిక చేస్తామని వివరించారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇళ్ల నిర్మాణంలో సహాయకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే.