సారాంశం

ఎమ్మెల్సీ కవిత పై ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేయనప్పుడు ఆమె గురించి మాట్లాడటం అనవసరం అని పేర్కొన్నారు. కవిత తన దారి తాను చూసుకోవాలని అన్నారు. తాను తన పని తాను చేసుకుంటానని వివరించారు.
 

హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. ఎమ్మెల్సీ కవిత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు నిజామాబాద్ పాత కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద బీజేపీ డబుల్ బెడ్‌రూంల గురించి ధర్నా చేసింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

డబుల్ బెడ్ రూమ్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్రానికి ఇచ్చిందని ఎంపీ ధర్మపురి అరవింద్ వివరించారు. రాష్ట్ర బడ్జెట్‌లోనూ ఈ పథకానికి కేటాయింపులను ఆయన ప్రస్తావించారు. ఎప్పుడో కట్టిస్తామన్న డబుల్ బెడ్ రూమ్‌లు ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేవని, కట్టిన కొన్ని ఇళ్లు ముట్టుకుంటే కూలిపోయేలా ఉన్నాయని ఆరోపించారు.

అదే విధంగా ఎమ్మెల్సీ కవిత గురించి ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత తనను ముక్కు నేలకు రాయాలని సవాల్ చేసిన విషయంపై స్పందించారు. తాను ముక్కు కాదు కదా.. చెప్పు కూడా నేలకు రాయబోనని అన్నారు. కవితనే ఐరన్ లెగ్ అని పేర్కొన్నారు. ఆమె ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరురాలు అని ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్లను కేసీఆర్.. కవితకు ఇచ్చాడని, ఆ డబ్బులను కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెట్టిందని అన్నారు.

Also Read: Manipur: మహిళల సారథ్యంలోని మూక.. ఇళ్లు, పాఠశాలను కాల్చి బూడిద చేసింది!

అదే విధంగా కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేయడం లేదు కదా.. అని అడుగుతూ, అలాంటప్పుడు ఆమె గురించి ఇక్కడ మాట్లాడటమే అవసరం లేదని అన్నారు. కవిత తన దారి తాను చూసుకోవాలని, తాను తన పని చేసుకుంటానని పేర్కొన్నారు. ఆమె ఇక్కడ పోటీ చేయనప్పుడు ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు.